అగ్రహీరోల సినిమాల విడుదల అంటే అభిమానులకు పండగ రోజులాంటిది. అలాంటి హీరో సినిమాలు రెండూ ఒకే రోజు విడుదలైతే ఎలా ఉంటుంది? అలాంటి ఓ అరుదైన సంఘటనే 1993లో జరిగింది. నందమూరి హీరో బాలకృష్ణ నటించిన ‘నిప్పురవ్వ’, ‘బంగారు బుల్లోడు’ ఒకేసారి సెప్టెంబర్ 13న విడుదలయ్యాయి. ‘నిప్పు రవ్వ’ను యువరత్న ఆర్ట్స్ బ్యానర్‌పై బాలకృష్ణ నిర్మించారు. కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయశాంతి, శోభన హీరోయిన్లుగా నటించారు. విజయశాంతి ఈ సినిమాకు మరో నిర్మాత. ‘నిప్పు రవ్వ’కు నలుగురు సంగీత దర్శకులు పనిచేయడం విశేషం.. సంగీతపరంగా ‘నిప్పురవ్వ’ సూపర్ హిట్. మార్కెట్లో విడుదలైన తొలిరోజే లక్ష క్యాసెట్లకు పైగా అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. దీంతో అభిమానుల్లో ఈ సినిమా పట్ల క్రేజ్ పెరిగింది.
అయితే సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరగడం, ఇతర కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యమైంది. దీంతో తప్పనిసరి పరిస్థుతుల్లో రెండింటిని ఒకే రోజు విడుదల చేయాల్సి వచ్చింది. అదే రోజు విడుదలైన ‘బంగారు బుల్లోడు’లో రమ్యకృష్ణ, రవీనా టాండన్ హీరోయిన్లుగా చేశారు. అది సూపర్‌డూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో గ్రామీణ యువతిగా రమ్యకృష్ణ నటించగా, సిటీ అమ్మాయిగా రవీనా టాండన్ చేసింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ రెండు చిత్రాల్లో ‘బంగారు బుల్లోడు’ చిత్రం అధిక వసూళ్లను సాధించింది. పాటలు ఇప్పటికీ సూపర్ హిట్టే. అధిక బడ్జెట్‌తో పాటు సెకండాఫ్ లోపాల కారణంగా ‘నిప్పురవ్వ’ అనుకున్న మేర వసూళ్లను సాధించలేకపోయింది. ఈ సినిమా తర్వాత విజయశాంతి, బాలకృష్ణ మళ్లీ తెరపై కనిపించకపోవడం గమనార్హం..