మంచు విష్ణుకు గట్టి షాక్ తగిలింది. విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప నుంచి హీరోయిన్ నుపుర్ సనన్ తప్పుకొంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ విష్ణు ట్వీట్ చేశాడు. ‘‘డేట్స్ సర్దుబాటు చేయడంలో సమస్యలు తలెత్తడం వల్ల నటి నుపుర్ సనన్ ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారని ప్రకటించడం బాధగా ఉంది. ఆమెను మేము ఎంతో మిస్ అవుతాం. అలాగే, కొత్త నటీమణి కోసం వెతుకులాట మొదలు పెట్టాం. నుపుర్ భాగమైన ఇతర ప్రాజెక్టులన్నీ మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా. త్వరలోనే మేమిద్దరం కలిసి వర్క్ చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నా. ఆసక్తికరమైన రోజులు రానున్నాయి. అప్‌డేట్స్ కోసం వేచి చూడండి’’ అని ఆయన పేర్కొన్నారు.
విష్ణు ‘కన్నప్ప’ చిత్రాన్ని ఆగస్టులో పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఆ వేడుకలోనే హీరోయిన్ నుపుర్ సనన్ అని చిత్రబృందం ప్రకటించింది. కానీ తాజాగా నుపుర్ సినిమా నుంచి తప్పుకున్నట్లు విష్ణు ట్వీట్ చేశారు. ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్తకన్నప్ప చరిత్రను ఆదర్శంగా తీసుకుని ఈ చలనచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందించనున్నారు. ఇక, ఈ సినిమాలో ఎంతో కీలకమైన శివుడి పాత్రలో ప్రభాస్ నటించనున్నారంటూ ఇటీవల ప్రచారం సాగింది..!!