దాసరి నారాయణ రావు గారికి, అడవి రాముడు సినిమా లోని “కృషి ఉంటె మనుషులు ఋషులౌతారు “అనే పాటకు ఒక చిత్రమయిన లింక్ ఉంది. అదేమిటి అడవి రాముడు సినిమా డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు కదా అనుకుంటున్నారా, వస్తున్నా అక్కడికే వస్తున్నా కాస్త ఆగండి. దాసరి సినీ పరిశ్రమకు రాక ముందు హైదరాబాద్ లో హెచ్. ఏ.ఎల్. అనే సంస్థలో ఉద్యోగం చేసేవారు. ఆ రోజుల్లో దాసరి గారు సాయంత్రం పూట అబిడ్స్ లో నడిచి వెళుతుండగా, పెద్ద కల కలం, అందరు యెన్.టి.ఆర్. అంటూ పరుగెత్తడం చూసి దాసరి కూడా అటు వెళ్లారు, రామకృష్ణ థియేటర్స్ నిర్మాణ పనులు పర్యవేక్షించడానికి వచ్చిన యెన్.టి.ఆర్.
అక్కడ కనిపించారు,దగ్గరకు వెళ్లి నమస్కరించిన దాసరి ఆటోగ్రాఫ్ అడిగేతే, ” కృషి, పట్టుదల, దీక్ష ఉంటె జీవితం లో పైకి వస్తారు ” అని వ్రాసి సంతకం చేసారు. యెన్.టి.ఆర్. ఆ మాటలు తారక మంత్రం లాగా పని చేసాయి, అప్పటికి నాటకాలు వేస్తున్న దాసరి గారికి “అందం కోసం పందెం “అనే సినిమాలో కమెడియన్ ఆఫర్ వచ్చింది, చేస్తున్న ఉద్యోగం వదిలేసి, మద్రాస్ చేరిన దాసరి గారు ఎన్నో ఒడుదుడుకులు,అవమానాలు, కష్టాలు పడ్డారు, కానీ పట్టుదలతో, దీక్షతో యెన్.టి.ఆర్. గారినే డైరెక్ట్ చేసే స్థాయి కి ఎదిగారు. యెన్.టి.ఆర్. గారి ఆటోగ్రాఫ్ స్ఫూర్తి తో దాసరి గారు ఆ స్థాయి ఎదగటం, ఆ విషయాన్ని ఒకానొక సందర్భం లో యెన్,టి.ఆర్. గారికి దాసరి చెప్పగా, అవునా బ్రదర్ అంటూ ఆశ్చర్య పోయారట..