సినీ తారలు, ప్రముఖులపై ఈ మధ్య సోషల్ మీడియాలో వేధింపులు, బెదిరింపులు తరుచుగా చూస్తున్నాం. ఇటీవల కథానాయిక హానిరోజ్ కూడా సోషల్ మీడియా ద్వారా తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో కథానాయిక నిధి అగర్వాల్ కూడా చేరారు.
సోషల్ మీడియా ద్వారా తనను ఇబ్బందికి గురిచేస్తూ, వేధిస్తున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్‌లో నిధి ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి తనను చంపేస్తానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా పెడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పాటు తనకు ఇష్టమైన వారిని కూడా లక్ష్యంగా చేసుకుని, బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా నిధి అగర్వాల్ ఈ కంప్లైట్‌లో ప్రస్తావించారు. ఈ బెదిరింపుల వల్ల తాను మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నానని, ఆ నిందితుడిపై చర్యలు తీసుకోవాలని నిధి అగర్వాల్ తన ఫిర్యాదులో పేర్కొంది..!!