సినిమా పరిశ్రమలో మరో హీరోయిన్ తల్లి కాబోతోంది. ఆమె ఎవరో కాదు… నమిత. ఈరోజు నమిత పుట్టినరోజు. ఈ సందర్భంగా తాను గర్భవతి అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు బేబీ బంప్ ఫోటోను పోస్ట్ చేసింది. ‘మాతృత్వం… నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. నేను మారాను, నాలోనూ మార్పు మొదలైంది. నా ముఖంలో చిరునవ్వు వచ్చింది. కొత్త జీవితం, కొత్త పిలుపులు, మాతృత్వపు అనుభూతి కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూశా. చిన్నారి కిక్స్ కొత్త అనుభూతి ఇస్తున్నాయి. ఇంతకు ముందు ఎప్పుడూ లేని కొత్త ఫీలింగ్’ అంటూ సదరు పోస్టులో నమిత రాసుకొచ్చింది.
సొంతం సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నమిత.. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్‌తో జెమిని, రవితేజతో ఒకరాజు-ఒకరాణి, ప్రభాస్‌తో బిల్లా, బాలయ్యతో సింహా వంటి సినిమాల్లో నటించింది. అయితే తెలుగులో కంటే తమిళంలో నమిత ఎక్కువగా నటించింది. తమిళంలో అయితే అభిమానులు ఆమెకు గుడి కూడా కట్టేశారు. కెరీర్ కొంచెం నెమ్మదించాక 2017లో వ్యాపారి వీరేంద్ర చౌదరితో నమిత వివాహం జరిగింది. వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటిస్తూనే ఉంది. తాజాగా ఆమె ప్రెగ్నెంట్ కూడా కావడంతో పలువురు అభిమానులు విషెస్ తెలుపుతున్నారు..