ప్రముఖ హాస్య నటుడు సి.కె.నగేష్ దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు. దక్షిణాది ప్రేక్షకులు నగేష్ గారిని “సౌత్ ఇండియన్ చాప్లిన్” అని పిలుచుకునేవారు. నగేష్ గారు అసలు పేరు ” గుండూ రావు” , పుట్టుకతో కన్నడిగుడు, నటన మీద మక్కువ తో మద్రాసు చేరి, కొంత కాలం రైల్వేస్ లో పని చేసి నటుడిగా ఎదిగిన కృషీవలుడు. నటుడిగా గుర్తింపు పొందిన తరువాత కొంత కాలం తమిళ చిత్ర పరిశ్రమ ఆయనకు అవకాశాలు ఇవ్వకుండా దూరం పెట్టింది. అప్పట్లో తమిళ సూపర్ స్టార్ ఏం.జి.ఆర్. సెట్లోకి రాగానే అందరు లేచి నిలబడే ఆనవాయితీ ఉండేది. స్వయం కృషి తో ఎదిగిన నగేష్ గారు నేనెవరికయినా ఎందుకు భయపడాలి అనే ధోరణిలో ఉండేవారు. ఓ సినిమా షూటింగ్లో ఏం.జి.ఆర్. వచ్చినప్పుడు నగేష్ గారు లేచి నిలబడలేదు..
అది గమనించిన ఏం.జి.ఆర్. గారికి కోపం వచ్చింది, ఇంకేముంది ఏం.జి.ఆర్. ను కాదని నగేష్ కి అవకాశాలు ఇచ్చే సాహసం చేయలేదు తమిళ నిర్మాతలు. అటువంటి క్లిష్ట పరిస్థితులలో యెన్.టి.ఆర్. నగేష్ గారికి తెలుగులో వరుస అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు, చిన్న, చిన్న కారణాలతో ప్రతిభావంతులను కించపరచ కూడదు అనేది యెన్.టి.ఆర్. అభిమతం. మెల్లగా ఆ విషయం కాస్త ఏం.జి.ఆర్. దృష్టి కి వెళ్ళింది, తన సహనటుడు ప్రోత్సహిస్తుండగా, తాను అడ్డంకులు కలిగేస్తే అది తన ప్రతిష్ట కె భంగం అని తలిచిన అయన తన పట్టు సడలించారు. అవకాశాలు లేక ఇబ్బంది పడకుండా తనకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన యెన్.టి.ఆ.ర్ పట్ల సదా కృతజ్ఞతతో ఉండేవారు నగేష్. యెన్.టి.ఆర్. దృష్టిలో సినిమా ముఖ్యం మిగతా విషయాలు అన్ని దాని తరువాతే…