
అక్కినేని నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు తాజాగా ముగిసింది. మాజీ మంత్రి కొండా సురేఖపై నాగార్జున వేసిన పరువు నష్టం దావాను నాంపల్లి స్పెషల్ కోర్టులో ఆయన వెనక్కు తీసుకున్నారు. 2024 అక్టోబర్ 2న హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద వివాదానికి దారితీశాయి. నాగచైతన్య–సమంత విడాకులకు మంత్రి కేటీఆర్ కారణమని సురేఖ చేసిన కామెంట్ రాజకీయాల్లో కలకలం రేపింది..
ఆ వ్యాఖ్యల వల్ల తన కుటుంబ పరువుకు నష్టం కలిగించారంటూ నాగార్జున, కొండా సురేఖపై పరువు నష్టం దావా దాఖలు చేశారు. BNS సెక్షన్ 356 కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ ఆయన పిటిషన్ వేశారు. ఇప్పటికే రెండుసార్లు సోషల్ మీడియాలో అక్కినేని కుటుంబానికి క్షమాపణ తెలిపిన సురేఖ, తాజాగా బహిరంగంగా కూడా క్షమాపణ చెప్పారు. దాంతో నాగార్జున ఈ కేసును విత్‌డ్రా చేసుకున్నారు. ఈ పరిణామంతో అక్కినేని కుటుంబం–కొండా సురేఖ మధ్య నెలకొన్న వివాదం ముగిసినట్లయింది. నాగార్జున ఈ నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు, సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి..!!
