NTR జీవితం లో జరిగిన అత్యంత విషాదకరమయిన సంఘటన, పదిహేడేళ్ళ వయసులో ఆయన పెద్ద కుమారుడు రామకృష్ణ మరణం. మహా మంత్రి తిమ్మరుసు చిత్రంలో యెన్.టి.ఆర్. నటించిన ఒక సన్నివేశం ఆయన నిజ జీవితంలోను జరగటం అత్యంత ఆశ్చర్యకరం మరియు విషాదకరం. కృష్ణ దేవ రాయలు తన కుమారుడు పుట్టిన రోజున బిడ్డను,ఆశీర్వదించి యుద్ధానికి వెళ్ళిన నాలుగు రోజులకు విషయప్రయోగం చేత కుమారుడు మరణించాడని తెలిసి, పరుగు, పరుగున వచ్చిన కృష్ణ దేవ రాయలు, విష ప్రయోగం వలన నల్లగా మారినకుమారుడి ముఖం చూడలేక, చివరి చూపు చూడకుండానే ఖననం చేసేస్తారు.
యెన్.టి.ఆర్. పెద్ద కుమారుడు రామ కృష్ణ యెన్.టి.ఆర్. లాగానే ఆరడుగుల అందగాడు, వినయశీలి,తెలివిగలవాడు. 1962 లో మే 20 వ తేదీన నిమ్మకూరు బయలుదేరిన రామ కృష్ణ సాగనంపడానికి కారు దాక వచ్చిన తల్లి, తండ్రిని చూసి, కారు దిగి కాళ్లకు నమస్కరించి వెళ్లిపోయారు. ఇది జరిగిన రెండు రోజులకు రామ కృష్ణ కు మాసూచి సోకింది, మే 27 వ తారీకున ఆయన మరణించారు, ఈ సంఘటన జరిగినపుడు, యెన్.టి.ఆర్. “ఇరుగు పొరుగు” చిత్రం షూటింగ్ లో ఉన్నారు, వార్త తెలిసిన ఆయన చెక్కు చెదరకుండా, గంభీరంగా షూటింగ్ పూర్తి చేసి, మేక్ అప్ రూంలో మేక్ అప్ తీసిన తరువాత కన్నీటి పర్యంతం అయ్యారు..
ఆయనను ఓదార్చటం ఎవరి తరం కాలేదు. మనసు రాయి చేసుకొని నిమ్మకూరు వెళ్ళిన యెన్.టి.ఆర్. కుమారుడి ముఖం చూడటానికి సాహసించలేక పోయారు. అందమయిన తన బిడ్డ ముఖం మాసూచి మచ్చలతో చూడలేక, చివరి చూపు చూడకుండానే రామకృష్ణను సాగనంపారు. విధి ఎంత విచిత్రమో చూడండి రాయలవారి జీవితంలో జరిగిన సంఘటనే, యెన్.టి.ఆర్. జీవితంలోను జరగటం కాకతాళీయం కావచ్చు, కానీ అత్యంత విషాదకరం.