వెండి తెర మీద రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు ఇలా పౌరాణిక పాత్రలు ధరించాలంటే యెన్.టి.ఆర్. తరువాతే అన్నంతగా కీర్తి గడించారు యెన్.టి.ఆర్. అటువంటి యెన్.టి.ఆర్ శివుడి పాత్రలో నటించింది మాత్రం కేవలం రెండు చిత్రాలలోనే. యెన్.టి.ఆర్. శివుడి పాత్రకు దూరంగా ఉండటానికి అయన జీవితం లో జరిగిన ఒక విషాద సంఘటనే కారణం. యెన్.టి.ఆర్. మొట్ట మొదటి సారిగా శివుడిగా నటించిన చిత్రం “దక్షయజ్ఞం”.
ఆ చిత్రంలో శివుడిగా యెన్.టి.ఆర్. నటన అద్భుతం, శచి దేవి మరణం తరువాత ఆవేదనకు, ఆగ్రహానికి గురి అయిన , ప్రళయకాల రుద్రుడిగా ఆయన చేసిన శివతాండవం రోమాంచితం. థియేటర్లలో ప్రేక్షకులు పూనకాలతో ఊగి పోయారు, యెన్.టి.ఆర్. కి బ్రహ్మరధం పట్టారు .” దక్షయజ్ఞం” చిత్రం 1962 మే 10 వ తేదీన రెలీజ్ అయింది, సరిగ్గా పదిహేను రోజులకు యెన్.టి.ఆర్. పెద్ద కుమారుడు రామకృష్ణ అకాల మరణం చెందారు, ఈ సంఘటన యెన్.టి.ఆర్. ని తీవ్రంగా కలచి వేసింది..
లయకారుడి పాత్ర యెన్.టి.ఆర్. కి కలసి రాలేదని అని అందరు చెప్పటం తో శివుడి పాత్రలో నటించ కూడదు అని నిర్ణయించుకున్నారు యెన్.టి.ఆర్. ఆ తరువాత తనకు గురు సమానులయిన కె.వి. రెడ్డి గారు నిర్మించిన “ఉమా చండి గౌరీ శంకరుల కధ” అనే చిత్రంలో, శివుడి ని జటాజూటం తో కాకుండా, కిరీటం తో చూపిస్తామని కె.వి. రెడ్డి గారు యెన్.టి.ఆర్. ని కన్వెన్స్ చేసి ఆ చిత్రం లో నటింపచేసారు. ఈ చిత్రం తరువాత యెన్.టి.ఆర్. పొరపాటున కూడా శివుడిగా వెండి తెర మీద కనిపించలేదు.