అపార్ధాలు, కోపాలు, తాపాలు ఆ తరువాత అలకలు, అందరి జీవితాలలో సహజం. ఇటువంటి సంఘటనే గుమ్మడి గారు యెన్.టి.ఆర్. మధ్య జరిగింది. వీరిద్దరూ ఒకప్పటి రూమ్ మేట్స్, మంచి స్నేహితులు, సౌమ్యుడయిన గుమ్మడి గారు, సహా నటుల పట్ల ఎంతో గౌరవం, ఆప్యాయత చూపించే యెన్.టి.ఆర్. మధ్య ఒక చిన్న అపార్ధం, వీరి మధ్య ఐదారేళ్ళు మాటలు లేకుండా చేసింది. హైదరాబాద్ లో స్థిరపడి ఎక్కువగా హైదరాబాద్ లోనే షూటింగ్ చేసే అక్కినేని గారి తో నటించేందుకు నెలకు ఇరవై రోజులు హైదరాబాద్ లోనే ఉండే వారు గుమ్మడి గారు. అటువంటి సమయం లోనే అనుకోకుండా అక్కినేని గారితో కలసి అప్పటి రెవిన్యూ మంత్రి , చెన్నా రెడ్డి ని కలవటం సినీ పరిశ్రమ కోసం అక్కినేని గారు బంజారా హిల్స్, జూబిలీ హిల్స్ లో స్థలాలు ఇస్తే బాగుంటుంది అని చర్చించటం జరిగింది. ఈ ఘటన తరువాత మద్రాసు వెళ్లిన గుమ్మడి గారు యెన్.టి.ఆర్. తో షూటింగ్ లో పాలుగోన్నారు, మేక్ అప్ రూమ్ లో కలసి ఏమిటి హైదరాబాద్ విశేషాలు అని అడిగిన యెన్.టి.ఆర్. తో విషయం చెప్పారు,
అది వినిన యెన్.టి.ఆర్ ఆగ్రహోదగ్రులు అయ్యారు, అంటే నా ప్రమేయం లేకుండా అక్కినేని తో కల్సి సినీ పరిశ్రమ గురించి నిర్ణయాలు తీసుకుంటున్నారా? అంటూ యెన్.టి.ఆర్. మండి పడ్డారు. జరిగిన విషయం ఆయనకు చెప్పాలని ఎంత ప్రయత్నించినా ఆయన విని పించుకోలేదు. అంతే ఇద్దరి మధ్య అపార్ధం అనే అగాధం, మాటలు బంద్ అయ్యాయి. తానేమి తప్పు చేయకపోయినా తన గురించి యెన్.టి.ఆర్. ఆలా ఆలోచించటం గుమ్మడి గారిని చాలా బాధించింది. మన ప్రమేయం ఉన్న,లేకున్నా కొన్ని సార్లు కొన్ని వివాదాలలో ఇరుక్కోవలసి వస్తుంది. ఈ అపార్ధం ఎంత దూరం వెళ్ళింది అంటే గుమ్మడి గారి కుమార్తె వివాహానికి సినీ పరిశ్రమ మొత్తం హాజరు అయింది, ఒక్క యెన్.టి.ఆర్. తప్ప.ఆ సమయం లోనే సినీ పరిశ్రమకు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాలుగోనెందుకు వచ్చిన చీఫ్ మినిస్టర్ కాసు బ్రహ్మ్మనంద రెడ్డి గారికి, అక్కినేని కి వ్యతిరేకం గ ఒక వినతి పత్రం సమర్పించే ప్రయత్నం చేసారు కొందరు, ఆ చర్యను గుమ్మడి గారు తీవ్రంగా వ్యతిరేకించారు..!!