ఇది వరకు చిరంజీవి ఓ కథని ఓకే చేయాలంటే గగనం. ఓ కథ ఒప్పుకుంటే, దానిపైనే ఫోకస్ చేసేవారు. సినిమా తరవాత సినిమా. అంతే. మంచి కథ దొరక్కపోతే.. యేడాది పాటు సినిమాలేం చేయని వైనాలూ ఉన్నాయి. హిట్లర్ సినిమాకి ముందు దాదాపు యేడాది పాటు మేకప్ వేసుకోలేదు మెగాస్టార్. అయితే ఇప్పుడు తన పంధా మారింది. ఓ చేతిలో సినిమాఉండగానే, మరో సినిమా.. అది అవ్వకుండానే ఇంకోటి.. ఇలా తన జోరు అమాంతం పెంచేశారు. ఇప్పుడు చిరు చేతిలో ఏకంగా 4 సినిమాలు ఉన్నాయి. ఉండడమే కాదు. ఒకే నెలలో.. ఆ నాలుగు సినిమాలూ షూటింగ్ జరుపుకుంటున్నాయి.
చిరు నటిస్తున్న ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ చిత్రాలు ఈ డిసెంబరులో షూటింగ్ జరుపుకుంటున్నాయి. దాంతో పాటు.. బాబి సినిమా కూడా ఇటీవలే మొదలైపోయింది. ఈ నెలలో ఈ నాలుగు సినిమాలకూ డేట్లు కేటాయించారు చిరు. ఇది చిరంజీవి కెరీర్‌లోనే ఓ రికార్డ్. ఇన్నేళ్ల కెరీర్‌లో నాలుగు సినిమాల్ని ఒకేనెలలో షూటింగ్ ఎప్పుడూ చేయలేదు. అందుకే ఇది నెవర్ బిఫోర్.. రికార్డ్ గా అభిమానులు చెప్పుకుంటున్నారు. చిరు నటించిన ఆచార్య ఫిబ్రవరి 4న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. 2022లోనే గాడ్ ఫాదర్ కూడా రాబోతోంది. వీలైనంత వరకూ భోళా శంకర్ నీ రంగంలోకి దింపేయాలన్నది చిరు ప్లాన్.