
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం టైటిల్‌పై వివాదం చెలరేగింది. ఇటీవలే ‘గ్లోబ్ ట్రాటర్’ పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించి, ఈ చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్‌ను ప్రకటించారు. అయితే, ఈ టైటిల్ తమదేనంటూ ఓ చిన్న సినిమా నిర్మాత ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది..
వివరాల్లోకి వెళితే, సి.హెచ్. సుబ్బారెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్‌ను తాము ముందుగానే ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించామని, ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని నిర్మాత విజయ్ కె. తెలిపారు. తమ అనుమతి లేకుండా రాజమౌళి తమ టైటిల్‌ను ఎలా ప్రకటిస్తారని ఆయన ప్రశ్నిస్తూ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. ఛాంబర్ జారీ చేసిన రిజిస్ట్రేషన్ పత్రాన్ని కూడా వారు మీడియాకు విడుదల చేశారు..!!

