ఈశతాబ్దం నాది, నేను విశ్వమానవుడను అని సగర్వంగా చాటుకున్నాడు మహా కవి శ్రీశ్రీ. అలాగే ఈ శతాబ్దపు మహానటి సావిత్రి, అని ప్రేక్షకులు, సహనటులు ఆమెను మహానటిగా గుర్తించారు, అభిమానించారు, ఈనాటికి ఆరాధిస్తూనే ఉన్నారు. ఆమె ఒక నట శిఖరం, మహా నటులు, యెన్.టి.ఆర్., ఎస్.వి.ఆర్., శివాజీ గణేశన్ వంటి వారు ఆమెతో కాంబినేషన్ సీన్ అంటే చాల అప్రమత్తంగా ఉండేవారు, ఆమెతో పోటీపడి నటించేవారు.ఏ కంటి నుంచి ఎన్ని కన్నీటి బొట్లు కావాలో లెక్క కట్టి నటించి, దిగ్గజ దర్శకులను అబ్బురపరిచిన నటి సావిత్రి గారు. ఆమె నట జీవితం మహోన్నతం,అనితరసాధ్యం కానీ ఆమె నిజ జీవితం సర్వం వ్యధాభరితం..
ఆమె నిష్క్రమణం విషాదభరితం, అత్యంత బాధాకరం. సావిత్రి గారు తన చివరి కోరికగా తన సమాధి మీది శిలాఫలకం మీద ఇలా వ్రాయమని కోరుకున్నారట. “జీవితంలోను, మరణంలోనూ.. మహోన్నతమయిన తార ఇక్కడ శాశ్వత విశ్రాంతి పొందుతున్నది, సానుభూతితో వేడి కన్నీటి బొట్లు విడవక్కరలేదు,మరణం లేని మహా ప్రతిభకు స్మృతి చిహ్నంగా ఒక చిన్న పూల మాలిక ను ఉంచండి”. ఆమె గడించిన ధన రాసులు కరిగిపోయి ఉండవచ్చు, అయినవారు మొహం చాటేసి ఉండవచ్చు, కానీ ప్రేక్షకుల హృదయాలలో ఆమె స్థానాన్ని ఎవరు చెరపలేరు, ఈనాటికి, ఏనాటికి ఆమె మహానటి, ఆమె ఒక్కరే మహానటి..