ఒకప్పటి మద్రాసు నగరంలోని ఒకకానొక వీధి, దాని పేరు బాజుల్లాహ్ రోడ్, ఆ వీధిలో దొంగలు పడటానికి సాహసించేవారు కాదు. ఎందుకు? ఆ వీధిలో ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉండేవారా ? కాదు. మద్రాసు నగరంలోని, టి.నగర్లోని, బాజుల్లాహ్ రోడ్ లో ఇంటి నెంబర్ 59 /28 లో అలనాటి వెండి తెర వేలుపు నందమూరి తారక రామ రావు గారు ఉండే వారు, ఆ ఇంటికి ఎదురుగ దర్శక రత్న దాసరి నారాయణ రావు గారు నివాసం ఉండే వారు. వీరిద్దరూ నివాసం ఉండటానికి దొంగలు పడకపోవటానికి లింకేంటి అనుకుంటున్నారా. ఉందండీ, అక్కడికే వస్తున్న.
దాసరి గారేమో తెల్లవారు ఝాము మూడు గంటల వరకు పని చేస్తూ ఇంట్లో లైట్లు వెలుగుతుండేవి, మూడింటి తరువాత ఆయన పడుకునే వారు. యెన్.టి.ఆర్.గారు తెల్లవారు ఝామున మూడింటికి నిద్రలేచి తన రోజువారీ కార్యక్రమాలు ప్రారంభించేవారు. అంటే దాసరి ఇంటిలో లైట్ స్విచ్ అఫ్ అవగానే, యెన్.టి.ఆర్.గారి ఇంటిలో లైట్స్ స్విచ్ ఆన్ అయ్యేవి. ఇద్దరు ఎంత వర్కుహాలిక్స్ అనే విషయం చెప్పటానికి స్వయంగా యెన్.టి.ఆర్ గారే ఈ విషయాన్నీ సభాముఖంగా వెల్లడించటం జరిగింది. ఇదండీ బాజుల్లాహ్ రోడ్డులో దొంగలు పడకపోవటానికి కారణం.