పిల్లపాలు గజపతి కృష్ణవేణి అంటే బహుశా చాలామందికి తెలియక పోవచ్చుఁ కానీ మధుర గాయని జిక్కి అంటే గతకాలపు ప్రేక్షకులే కాదు నేటి తరం ప్రేక్షకులు కూడా గుర్తు పడతారు. “జీవితమే సఫలము రాగ సుధా భరితము” అని ప్రేక్షకులను మైమరపించిన గాయని జీవితం మాత్రం అసఫలం, వ్యధాభరితం గ గడచి పోయింది. దానికి కారణం ఆమె ప్రేమించి పెళ్లాడిన మరో గాయకుడు ఏ. ఎం. రాజా గారు ఆయనకు అభిజాత్యం కాస్త ఎక్కువ, ఆయన మొండి తనం వలన ఆయన అవకాశాలు పోగొట్టుకోవటమే కాకా, జిక్కి గారిని కూడా పాటలు పాడకుండా కట్టడి చేసారు. కుటుంబ పోషణార్ధం కేవలం కచేరీల మీద ఆధారపడవలసి వచ్చింది. ఊరూరా కచేరీలు చేసే క్రమం లో ఒక రోజు అనొకొని సంఘటన తో ఆమె జీవితం మరింత అంధకారంలోకి జారీ పోయింది. ఒక రోజు రైలు ప్రయాణం లో ఉండగా, తమిళనాడు లోని వల్లీయూర్ స్టేషన్ లో తమ ట్రూప్ మెంబెర్ ఒకరిని వెదకటానికి ర్తెలు దిగిన రాజా గారు, రైలు కదిలే సరికి కదిలే రైలు ఎక్కబోయి కాలు జారీ రైలు కింద పడి ఆమె కళ్ళ ముందే మరణించారు.
ఆ సంఘటన తరువాత ఆమె కోలుకోవడానికి చాల కాలం పట్టింది, మళ్ళి ఆమె సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టిన ఆమెకు అవకాశాలు రాలేదు. సహాగాయని జమున రాణి గారు ఆమె కోసం కొన్ని కచేరీలు చేసి ఆమెకు సహాయం అందించారు. ఆ తరువాత చాల కాలానికి ఆదిత్య 369 సినిమా లో ” జాణవులే నెరజాణవులే” అనే పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు, మురారి చిత్రం లో ” అలనాటి బాలచంద్రుడు’ అనే పాటను కూడా ఆలపించారు, ఆ తరువాత విధి ఆమెను కాన్సర్ రూపం లో కాటు వేసింది, ” హాయి హాయిగా ఆమనీ ” పాడించిన మధుర గాయని జీవితం ” రాజశేఖర నీ పై మోజు తీరలేదురా” అంటూ ముగిసిపోయింది. ఇప్పటికి “పందిట్లో పెళ్లవుతున్నది,కనువిందువుతున్నది ” అంటూ ఆమె గొంతు మారు మోగుతూనే ఉంది. విధి చేతిలో బలి అయిన సినీ ప్రముఖుల జాబితాలో చేరిపోయారు జిక్కి గారు.