విలక్షణ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు..దాదాపుగా టాప్ హీరోలందరితోనూ హిట్ సినిమాలలో నటించిన విలక్షణమైన పాత్రలు పోషించాడు. అంతటి నటుడిని పట్టుకుని ఎన్టీఆర్ అభిమానులు కొట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు.. అయితే అంతటి తప్పు పని కోట గారు ఏమి చేశారా అనే ఆలోచన అందరి మనసులో రాకమానదు. అంతటి మహా నటుడు కోట ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 1980 ప్రాంతంలో తనను సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు తరిమితరిమి కొట్టినంత పనిచేసిన సంఘటనను గుర్తుకు చేసుకున్నాడు. ఈ ఆసక్తికరమైన సంఘటన పూర్తి వివరాలలోకి వెళితే సూపర్ స్టార్ కృష్ణ 1980 ప్రాంతాలలో ‘మండలాధీశుడు’ అన్న మూవీని నిర్మించాడు. అప్పట్లో ఏపీ సీఎం కొనసాగుతున్న నందమూరి తారకరామారావు విధానాలకు వ్యతిరేకంగా ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు నందమూరి తారకరామారావును అనుకరిస్తూ నటించాడు. ఈసినిమా అప్పట్లో సంచలనం. ఎన్టీఆర్ ను అనుకరిస్తూ ఆయన్ని నెగెటివ్ గా చూపించిన పాత్రలో కోట శ్రీనివాసరావు చేసిన పాత్ర హైలెట్గా నిలిచింది.
ఎన్టీఆర్ ను పోలిన పాత్రను చేసినందుకు కోట శ్రీనివాసరావు మాత్రం చాలా ఇబ్బందులే ఎదుర్కొన్నాడట. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానుల ఆగ్రహాన్ని కోట రుచి చూడవలసిన పరిస్థుతులు ఏర్పడ్డాయి. మండలాధీశుడు’ సినిమా విడుదలైన తరువాత కోట ఎక్కడ దొరుకుతాడా అని నందమూరి వీరాభిమానులు ఎదురు చూశారట. అదే సమయంలోనే రామారావు బెజవాడలో ఓ కల్యాణ మండపం ప్రారంభోత్సవానికి వెళ్లారు. అదే రోజున కోట తన వేరే పని నిమిత్తం మరో రైల్లో బెజవాడ చేరుకున్నాడట. ఎన్టీఆర్ కోసం వచ్చిన ఆయన అభిమానులు తనను చూసి ‘రేయ్… అడిగోరా కోటగాడు’ అని కేక పెట్టడంతో తన పై ఒకేసారి ఎన్టీఆర్ వీరాభిమానులు విరుచుకు పడ్డ విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆ తొక్కిసలాటలో ఎవరో వచ్చి జోక్యం చేసుకోవడంతో తనను విడిచి పెట్టారన్నాడు. ఆతరువాత తాను ఎన్టీఆర్ ను ఓ సారి కలిసినప్పుడు తనను ఒక్క మాట కూడ అనని గొప్ప సంస్కారి అని ఎన్టీఆర్ను కోట శ్రీనివాసరావు ఆకాశానికి ఎత్తేశాడు.