ఇటీవల ‘మే డే’ ఉత్సవాల్లో భాగంగా చిరంజీవి ప్రసంగం విషయంలో కోట అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అందులో చిరు మాట్లాడిన ఒక్కో మాటను పట్టుకుని విమర్శలు చేశారు. చిత్రపురి కాలనీలో ఆసుపత్రి కట్టించాలనుకుంటున్నట్లు చిరు చెప్పిన మంచి విషయం మీద కోట ఆ ఇంటర్వ్యూలో ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ముందు కార్మికులకు తిండి పెట్టాలని.. చిరంజీవి కట్టే ఆసుపత్రికి ఎవరొస్తారని కోట ప్రశ్నించారు.
ప్రతిభ వుండి కూడా ఎంతోమంది పని లేక కృష్ణానగర్‌లో ఆకలితో అలమటించడమే కాకుండా వ్యసనాల బారినపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని.. వాళ్ల దగ్గర డబ్బులుంటే అపోలో ఆసుపత్రికి వెళ్తారు కానీ.. చిరంజీవి కట్టే ఆసుపత్రికి ఎందుకు వెళ్తారని శ్రీనివాసరావు అన్నారు. ఇక మే డే వేడుకల్లో భాగంగా తాను సినీ కళాకారుడిని కాదని, కార్మికుడినని చిరు వ్యాఖ్యానించడాన్ని కోట తప్పుబట్టారు. కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే చిరంజీవి సినీ కార్మికుడు ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు. తనకు అలాంటి మాటలు నచ్చవని.. కానీ చిరంజీవి అంటే ఎంతో గౌరవమని కోట పేర్కొనడం గమనార్హం..