యువ చిత్ర బ్యానర్ మీద పలు విజయవంతమయిన చిత్రాలు నిర్మించిన నిర్మాత కాట్రగడ్డ మురారి గారు, చాలా నిబద్ధత కలిగిన నిర్మాత గ పేరు గడించారు. ఆయన నిర్మించినది 11 చిత్రాలే, కానీ అన్ని హిట్స్, ముఖ్యంగా ఆయన చిత్రాలలో సంగీతం, సాహిత్యానికి పెద్ద పీట వేసేవారు, ఆయన చిత్రాలన్నీ సంగీతపరంగా మరుపురానివిగా మిగిలి పోయాయి. దానికి ప్రధాన కారణం ఆయన నిర్మించిన అన్ని చిత్రాలకు కె.వి.మహదేవన్ గారు సంగీతం అందించారు, పాటలు ఏరి కోరి ఆత్రేయ గారితో వ్రాయించె వారు. మురారి గారు దాసరి డైరెక్షన్ లో” గోరింటాకు” సినిమా నిర్మిస్తున్న రోజుల్లో, ఒక చిత్రమయిన సంఘటన జరిగింది. దాసరి గారి రెకమండేషన్ తో వేటూరి గారి కి ఒక పాట వ్రాసే అవకాశం ఇచ్చారు మురారి. వేటూరి గారు “కొమ్మ కొమ్మకో సన్నాయి, కోటి రాగాలు ఉన్నాయి” అంటూ పల్లవి చెప్పారు, అది వినిన మురారి గారు బాగుంది, దీనిని పాలగుమ్మి పద్మ రాజు కు చూపించి ఆయన అభిప్రాయం తెలుసుకుంటాను అన్నారట. తాను రాసింది మరింకెవరికో చూపిస్తాను అంటాడేమిటి ఈయన అని నొచ్చుకున్న..
వేటురి గారు ఆ తరువాత మురారి గారిని తప్పించుకొని తిరగటం మొదలెట్టారట. వేటూరి గారితో మిగతా చరణాలు వ్రాయిద్దామంటే ఆయన దొరకక పోయే సరికి, మురారి గారు చాల చిరాకుగా ఉన్న సందర్భం లో ఆత్రేయ గారు మురారి గారి ఆఫీస్ కి రావటం జరిగిందట. విషయం తెలుసుకున్న ఆత్రేయ గారు చరణాలు నేను వ్రాస్తాను, అతని పేరే వేసుకోండి అని పది నిమిషాలలో చరణాలు వ్రాసి ఇచ్చేశారట. మాములుగా ఒక పాట వ్రాయటానికి రోజులు, నెలలు నిర్మాతలను తిప్పించుకొనే ఆత్రేయ గారు పది నిమిషాలలో పాట వ్రాయటం అంటే ఆశ్చర్యమే. మురారి గారికి ఆత్రేయ గారికి ఉన్న అనుబంధం అటువంటిది, పైగా ఆయన పేరు వేసుకోక పోవటం మరో విశేషం. గోరింటాకు సినిమాలో కొమ్మ కొమ్మకో సన్నాయి పాట వ్రాసింది వేటూరి గారు అని టైటిల్స్ లో వేసిన, వాస్తవానికి ఆ పాట వ్రాసింది ఆత్రేయ గారు. ఆ పాట సూపర్ హిట్ అయింది, సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది, సుజాత గారికి ఈ చిత్రమే తెలుగులో మొదటి చిత్రం..!!