శశివదనే’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్న యువ నటి కోమలి ప్రసాద్, తన కెరీర్‌కు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. తాను నటనకు స్వస్తి చెప్పి వైద్య వృత్తిలోకి వెళ్లిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఖాతాలు ప్రచారం చేస్తున్నాయని, అందులో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్ ద్వారా వివరణ ఇచ్చారు..
కొంతకాలంగా తనపై వస్తున్న వదంతులపై కోమలి స్పందిస్తూ.. “అందరికీ నమస్కారం. నేను నటనకు పూర్తిగా దూరమై డాక్టర్‌గా మారిపోయానంటూ తప్పుదోవ పట్టించే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ప్రముఖ మీడియా సంస్థలు కూడా వీటిని నిజమన్నట్లు ప్రచారం చేయడం బాధాకరం. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను” అని పేర్కొన్నారు. ఎన్నో కష్టాలు పడి, శివుని ఆశీస్సులతో సినీ రంగంలో ఈ స్థాయికి చేరుకున్నానని, తన కెరీర్‌ను మధ్యలో వదిలే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు..!!