హీరో అయినా, హీరోయిన్ అయినా ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం. అవకాశాలు వస్తున్నాయని ఎడాపెడా ఒప్పుకున్నా, భారీగా డబ్బు వస్తోందని కాల్షీట్లు ఇచ్చినా మొదటికే మోసం వస్తుంది. కెరీర్ కే దెబ్బ పడుతుంది. ఈ విషయంలో హీరోయిన్ కియరా అద్వానీ చాలా ముందు చూపుతో వ్యవహరిస్తోంది. సినిమాలు తగ్గినా కెరీర్ గ్రాఫ్ ను జాగ్రత్తగా కాపాడాలనుకుంటోంది. ఇందులో భాగంగా ఆమె కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై హిందీ రీమేక్ ప్రాజెక్టులో కియరా అద్వానీ నటించదట.
ఆమె తీసుకున్న తాజా నిర్ణయం ఇది. రీసెంట్ గా అలా వచ్చిన రెండు రీమేక్ ప్రాజెక్టుల్ని ఆమె పక్కనపెట్టింది. అందులో ఒక తమిళ రీమేక్, మరో మలయాళ రీమేక్ ఉన్నాయని సమాచారం. ఉన్నఫలంగా కియరా ఇలా రీమేక్స్ పై కఠిన నిర్ణయం తీసుకోవడం వెనక ఓ బలమైన కారణం ఉంది. రీసెంట్ గా జెర్సీ సినిమా రిలీజైంది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఆ రీమేక్ సినిమా బాలీవుడ్ లో అట్టర్ ఫ్లాప్ అయింది.
కేజీఎఫ్2 ప్రభంజనం ముందు ఈ సినిమా తేలిపోయిందని ప్రారంభంలో అనుకున్నప్పటికీ, రోజులు గడిచేకొద్దీ ఈ కంటెంట్ పై బాలీవుడ్ ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదనే విషయం స్పష్టమైంది. దీంతో కియరా అద్వానీ రీమేక్స్ విషయంలో జాగ్రత్త పడుతోంది. తెలుగులో సూపర్ హిట్టయిన అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో రీమేక్ చేసింది కియరా. అది పెద్ద హిట్టయింది. దీంతో ఆమెకు చాలా రీమేక్ ఆఫర్లు వస్తున్నాయి. కానీ కియరా మాత్రం కొన్నాళ్లు రీమేక్స్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.