తెలుగులో తోలి ఈస్టమన్ కలర్ చిత్రం అక్కినేని నాగేశ్వర రావు గారు నటించిన “అమర శిల్పి జక్కన”. నల్లరాతి బొమ్మలకు ప్రాణం పోసి నవరసాలు ఒలికించిన శిల్పి జక్కన జీవితం ఆధారంగా నిర్మించిన చిత్రం ఇది. కర్ణాటక రాష్ట్రం లోని బేలూరు, హళిబేడు లోని దేవాలయాల లోని శిల్ప సృష్టి కర్త అయిన జక్కన గ అక్కినేని నటించారు. ఆ చిత్రంలో నటించే సమయంలో 12 రోజులు చారు అన్నం, ఎగ్ పొరుటు తో గడిపారు అక్కినేని. కరెంటు కూడా లేని మారుమూల గ్రామాలలో షూటింగ్ చేయవలసి వచ్చింది, పెద్దగా వసతులు లేని గ్రామాలూ కావటం తో అక్కడ ఉన్న ఒక చిన్న గెస్ట్ హౌస్ లో బస ఏర్పాటు చేసారు నిర్మాత, అక్కినేని గారికి, నటుడు ధూళిపాళ్ల గారికి. ఆ ప్రాంతంలో ఎటువంటి హోటల్ లేక పోవటం తో భోజనం కోసం చాల తిప్పలు పడవలసి వచ్చింది వీరిద్దరికి.
అక్కినేని గారు గెస్ట్ హౌస్ వాచ్ మాన్ తో అన్నం వండించి, అతనికి చారు కాయటం నేర్పించి చేయించేవారట, ఇక నంచుకోవటానికి వాచ్ మాన్ కి ఉన్న కోడి పెట్టె ఒక గుడ్డు తోపాటు మరో గుడ్డు తెప్పించి దానితో పొరుటు చేయించేవారట. అక్కినేని గారేమో నాన్ వెజిటేరియన్, ధూళిపాళ్ల గారేమో వెజిటేరియన్, అయినా కూడా ఆయనను కన్వెన్స్ చేసి గుడ్డు తినిపించారట అక్కినేని. పాపం ధూళిపాళ్ల గారు తప్పని పరిస్థితులలో గుడ్డు తినాల్సి వచ్చింది. అలా అక్కడ షూటింగ్ చేసిన 12 రోజులు అక్కినేని, ధూళిపాళ్ల వారి డైలీ మెనూ చారాన్నం, గుడ్డు పొరుటు మాత్రమే. అదే ఇప్పటి వారయితే ప్యాక్ అప్ చెప్పి వచ్చేసే వారు..