పాత్రలో ఒదిగిపోవడం ఒక ఎత్తైతే, దానికి డబ్బింగ్ చెప్పుకోవడం మరో ఎత్తు. కెరీర్ ప్రారంభమైన అనతి కాలంలోనే రెండింటిలోనూ సత్తా చాటింది కీర్తి సురేశ్. అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కిన ‘మహానటి’లో సావిత్రి పాత్రలో జీవించి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుని శెభాష్ అనిపించుకుంది. తెలుగు భాషపై పట్టులేకపోయినా కేవలం 11 రోజుల్లోనే డబ్బింగ్ పూర్తి చేసింది. ‘సావిత్రి పాత్ర పోషించి, 11 రోజుల్లోనే డబ్బింగ్ పూర్తి చేయడం కొత్త అనుభూతిని పంచింది’ అని ఓ సందర్భంలో తెలియజేసింది.
కీర్తినే కాదు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన సమంత, దుల్కర్ సల్మాన్ సైతం తమ పాత్రలకు తామే గాత్రం అందించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించింది. ప్రస్తుతం మహేశ్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’లో నటిస్తోంది కీర్తి సురేశ్. ఆమె నటించిన ‘గుడ్ లక్ సఖి’ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు.. మలయాళీ చిత్రాలు ‘మరక్కర్’, ‘వాశీ’, తమిళ చిత్రాలు ‘సానికాయిధం’, ‘అన్నాత్తె’తో బిజీగా ఉంది.