కనకాల వెంకటేష్ అంటే తెలుగు సినిమా పరిశ్రమలో, బహుశా ఎవరికి తెలియక పోవచ్చు, కానీ సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ అంటే తెలియని వారుండరు. కనకాల వెంకటేష్ ని మార్తాండ్ కె. వెంకటేష్ గ మార్చింది ఎవరు? వెంకటేష్ గారి నాన్న గారు కె.ఏ. మార్తాండ్ మొదటి తరం ఎడిటర్స్ లో మంచి పేరున్న వ్యక్తి. నాన్న గారి బాటలో, వెంకటేష్ గారు ఎడిటర్ గ తన కెరీర్ ప్రారంభించిన కొత్తలో, రాఘవేంద్ర రావు గారు వెంకటేష్ గారికి ఎడిటర్ గ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు.
పెళ్లి సందడి చిత్రీకరణ సమయం లో ఎడిటర్ గ ఉన్న వెంకటేష్ గారిని పిలిచి నీ పేరు నలుగురికి గుర్తు ఉండి పోవాలి అంటే, అప్పటికే కీర్తిశేషులు అయిన వారి నాన్న గారి పేరును తన పేరులో చేర్చుకోమన్నారు. మార్తాండ్ అనే పేరులో ఒక పవర్ వుంది అది నీకు, నీ కెరీర్ కి ఉపయోగపడుతుంది అని చెప్పి, కనకాల వెంకటేష్ పేరును మార్తాండ్ కె. వెంకటేష్ గ మార్చి టైటిల్స్ లో వేశారు. అప్పటి నుంచి మార్తాండ్ కె. వెంకటేష్ గ నాలుగు నంది అవార్డులు సాధించి, ఎదురులేని ఎడిటర్ గ కొనసాగుతున్నారు.