హ్యూమన్ రిలేషన్స్, లవ్ స్టోరీ సినిమాలతో ఆకట్టుకుంటూ వస్తున్న శేఖర్ కమ్ముల ఈ సారి థ్రిల్లర్ పై కన్నేశాడు. నాగచైతన్య, సాయిపల్లవితో కమ్ముల తీసిన ‘లవ్ స్టోరీ’ 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో సమావేశమైన శేఖర్ తన తదుపరి చిత్రాన్ని ధనుష్‌తో తీయబోతున్నట్లు ధృవీకరించాడు. నిజానికి ఇప్పటికే దీని గురించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. అయితే శేఖర్ కమ్ముల ఈ సారి తను తీయబోయే సినిమా ఎలా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా తెలియచేశాడు.
ధనుష్‌తో తీయబోతున్న సినిమా థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కబోతున్నట్లు చెప్పాడు. అంతే కాదు ఇది బహుళ భాషా చిత్రంగా రూపొందనుందని తెలిపాడు. షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభంలో మొదలవుతుందని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మిస్తారని అన్నాడు. ఇక 24న వస్తున్న ‘లవ్ స్టోరీ’ కూడా ప్రేమకథా చిత్రాల్లో కొత్తగా ఉండి అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.