బోనీ కపూర్, శ్రీదేవిల కూతురు జాన్వీ కపూర్ కొత్త సినిమా ‘మిలీ’ టీజర్ బుధవారం యూట్యూబ్‌లో విడుదల అయింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన సర్వైవల్ థ్రిల్లర్ ‘హెలెన్’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. పొరపాటున ఫ్రీజర్‌లో చిక్కుకుపోయిన అమ్మాయి ఎలా తన ప్రాణాలు కాపాడుకుంది అనేది ఈ సినిమా కథాంశం. జాన్వీతో పాటు మనోజ్ పహ్వా, సన్నీ కౌశల్, హస్లీన్ కౌర్, రాజేష్ జైస్, సంజయ్ సూరిలు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. మలయాళంలో ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన మతుకుట్టి గ్జేవియర్ హిందీ వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు స్వరాలను అందిస్తుండటం విశేషం. నవంబర్ 4వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమాను బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్‌పై జాన్వీ తండ్రి బోనీ కపూర్ స్వయంగా నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్ఫణలో ఈ సినిమా తెరకెక్కింది. దీన్ని బట్టి ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను జీ దక్కించుకుందని అనుకోవచ్చు. జాన్వీ కపూర్‌కు ఇది వరుసగా రెండో సౌత్ రీమేక్. తన ముందు సినిమా ‘గుడ్ లక్ జెర్రీ’ కూడా తమిళ సినిమా ‘కొలమావు కోకిల’కు రీమేక్‌గా తెరకెక్కింది. అయితే ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదల అయింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దీని డైరెక్ట్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. ఇప్పటివరకు జాన్వీ ఆరు సినిమాల్లో నటించగా వాటిలో మూడు సినిమాలు రీమేక్‌లే. మొదటి సినిమా ‘ధడక్’ మరాఠీ సూపర్ హిట్ ‘సైరాట్’కు రీమేక్. ‘గుడ్ లక్ జెర్రీ’, ‘మిలీ’ కూడా రీమేక్‌లే. జాన్వీ తొలి తెలుగు సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు…!!