చాలా మంది సినిమా నటన మీద మోజుతో, హీరోలు అయిపోదామని మద్రాసు నగరం చేరి, పాండి బజార్ లో తిరుగుతూ, పానగల్ పార్క్ లో సేద తీరుతూ అవకాశాలకోసం ప్రయత్నిస్తూ తిరిగే రోజుల్లో సినిమా అవకాశం తన ప్రమేయం, ప్రయత్నం లేకుండా,వెతుక్కుంటూ వచ్చిన నటుడు జగ్గా రావు. మాచెర్ల లో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ లో ట్రాన్స్పోర్ట్ మేనేజర్ గ పని చేసుకుంటున్న జగ్గా రావు కు అనుకోకుండా సినిమా అవకాశం తలుపు తట్టింది. జగ్గా రావు కి మన సీనియర్ నటుడు కొంగర జగ్గయ్య గారు సోదరుడు వరుస అవుతారు, జగ్గా రావు రైతు బిడ్డ, రైస్ మిల్ ఓనర్, అందరు మిల్లర్ ల లాగ మోసాలు చేయటం పొసగని జగ్గా రావు రైస్ మిల్ వదలి, మాచర్లలో సిమెంట్ ఫ్యాక్టరీ లో ట్రాన్స్పోర్టు మానేజర్ గ సెటిల్ అయ్యారు. ఆ రోజుల్లోనే పాపులర్ విలన్ ఆర్. నాగేశ్వర రావు హాఠాత్హు గ కన్ను మూసారు, హాస్య నటుడు రేలంగి నిర్మిస్తున్న” సమాజం” చిత్రంలో ఆయన ప్రధాన విలన్, ఆర్. నాగేశ్వర రావు లాగా కనిపించే మరొక మనిషి కోసం వెతుకుతున్న సమయం లో జగ్గా రావు గురించి రేలంగి గారికి తెలిసి, జగ్గా రావు ను సంప్రదించారు..
నటనకు ససేమిరా అన్న జగ్గా రావును బతిమాలి, బామాలి సినిమాలో నటింపచేసారు. అదే విధం గ ఇంకొక చిత్రం భక్త శబరి లో కూడా ఆర్ నాగేశ్వర రావు స్థానం లో నటించే అవకాశం వచ్చింది, అందులో కూడా నటించారు. ఆ తరువాత కొద్దీ రోజుల్లోనే” భీష్మ” చిత్రంలో దుశ్శాసనుడిగా నటించిన జగ్గా రావు కి, యెన్.టి.ఆర్. తో పరిచయం ఏర్పడింది, అంతే యెన్.టి.ఆర్. కి కుడి భుజం గ మారిపోయారు. యెన్.టి.ఆర్. చిత్రంలో జగ్గా రావు కి ఒక వేషం తప్పకుండ ఉండేది, మన సినిమాలో జగ్గా రావు భాయ్ ఉన్నారా లేదా అని యెన్.టి.ఆర్ ప్రత్యేకంగా అడిగే స్తాయి కి ఉండేది వీరిద్దరి అనుబంధం. కత్తి ఫైటింగ్ అంటే యెన్.టి.ఆర్ కి జోడిగా జగ్గా రావు ఉండ వలసిందే. దాదాపుగా 500 చిత్రాలు నటించిన సుదీర్ఘ ప్రయాణం జగ్గా రావు గారిది. సినిమా అవకాశాల కోసం వెంపర్లాడకుండానే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చిన లక్కీ విలన్ జగ్గా రావు గారు..!!