ఎవరేమనుకున్నా సరే తాను నిజాల్ని నిర్భయంగా చెబుతానని అంటోంది చెన్నై చిన్నది శృతిహాసన్. వ్యక్తులు, వ్యవస్థల్లో తాను నిజాయితీని, స్వచ్ఛతను ఆశిస్తాను కాబట్టే నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తానని పేర్కొంది. తాను మాట్లాడిన మాటల్ని చాలాసార్లు మీడియాలో వక్రీకరించారని, అయినా ఎప్పుడు భయపడలేదని స్పష్టం చేసింది. ఆమె మాట్లాడుతూ ‘మా అమ్మనాన్న విడాకులు తీసుకొని వేరుగా ఉండటంపై నా అభిప్రాయం ఏంటని ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో అడిగారు.
వ్యక్తిగత స్వేచ్ఛను, సంతోషాన్ని వెతుక్కునే క్రమంలో వాళ్లు విడిపోయారు కాబట్టి ఆనందంగా ఉందని చెప్పాను. పేరెంట్స్ విడిపోతే కూతురు ఆనందంగా ఉందంటూ నా మాటల్ని తప్పుగా రాశారు. ఆ వార్తలు నన్ను బాధించాయి. సెన్సేషన్ కోసం నా మాటల్ని వక్రీకరించారనుకొని ఊరుకున్నా. ఇలాంటి చర్యలతో నిజాలు మాట్లాడే నా తత్వాన్ని ఎవరూ ఆపలేరు’ అని శృతిహాసన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగు చిత్రసీమ అంటే తనకు ఎనలేని గౌరవమని, విధి తనను తెలుగు ప్రేక్షకుల ప్రేమకు అర్హురాలిని చేసిందని శృతిహాసన్ భావోద్వేగంగా స్పందించింది.