అధిక వడ్డి ఇప్పిస్తానంటూ వందల కోట్ల రూపాయలు మోసం చేసిన వ్యాపారవేత్త శిల్పా చౌదరి వ్యవహరం బట్టబయలైంది. సినీ సెలబెట్రీలతో పాటు నగరానికి చెందిన ప్రముఖులను శిల్పా రూ. 100 నుంచి రూ. 200 కోట్లు మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన నార్సింగ్ పోలీసులు శిల్ప, ఆమె భర్తను శనివారం ఉదయం అరెస్టు చేశారు. శిల్ప బాధితుల్లో టాలీవుడ్‌కు చెందిన ముగ్గురు హీరోలు ఉండటం గమనార్హం.
పేజ్ 3 పార్టీలతో సెలబ్రెటీలను ఆకర్షిస్తూ శిల్పా మోసపూరితంగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. దీంతో తాము మోసపోయామంటూ ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు వరసగా పోలీసు స్టేషన్‌కు క్యూ కట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫేజ్ త్రి పార్టీలో ప్రముఖుల పేర్లు చెప్పి అధిక వడ్డికి ఇప్పిస్తానంటూ శిల్ప వందల కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు శిల్ప ఆమె భర్తపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
శిల్పా మోసం చేసిన వారిలో టాలీవుడ్ హీరోలతో పాటు వ్యాపారవేత్తలు, లాయర్లు, ఫైనార్సర్లు ఉన్నారు. శిల్పా చౌదరి వ్యవహారాన్ని గుర్తించిన రోహిణి అనే మహిళా బాధితురాలు తాను నాలుగు కోట్ల రూపాయలను శిల్పా చౌదరి కి ఇచ్చి మోసపోయానని శనివారం నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. మంచిరేవులోని ఓ విల్లాలో తాను నివాసం ఉంటున్నట్లు బాధితురాలు రోహిణి తెలిపారు. తనతో పాటు అనేక మంది వద్ద శిల్పా చౌదరి దాదాపు వంద కోట్లపై చిలుకు డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు తనకు తెలిసిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.