అనేక చిత్రాలలో ఆర్.నారాయణ మూర్తి బిట్ రోల్స్ వేశారు. అయితే ఏవీ పేరు తీసుకు రాలేదు. ఆ సమయంలో దాసరి ‘నీడ’ చిత్రంలో కీలక పాత్రలో నటించి మంచి పేరు సంపాదించారు. కానీ, అవకాశాలు పలకరించ లేదు. ఏదైనా చేయాలని తపించారు. ఆ తపనలో తానే హీరో కావాలని నిర్ణయించారు. బాగానే ఉంది. మరి తనతో సినిమా తీసే నిర్మాత ఎవరు అన్న ప్రశ్న తలెత్తింది. ఎలా ఎలా అంటూ నారాయణమూర్తి సతమతమవుతున్న సమయంలో కొందరు మిత్రులు ఆర్థిక సాయం చేస్తామని దన్నుగా నిలిచారు.
అందువల్లే తన బ్యానర్ కు ‘స్నేహచిత్ర’ అని నామకరణం చేసి తొలి ప్రయత్నంగా ‘అర్ధరాత్రి స్వతంత్రం’ తీశారు. ఆ సినిమా మంచి పేరు సంపాదించిపెట్టడంతో ముందుకు సాగారు. వరుసగా “లాల్ సలామ్, దండోరా, ఎర్రసైన్యం, చీమలదండు, దళం” వంటి చిత్రాలు తీశారు. ఈ చిత్రాలద్వారా వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకునిగా మంచిపేరు సంపాదించారు. ఇక పలువురు ప్రజాకవులతో తన చిత్రాలలో పాటలు రాయించారు. తన గురుతుల్యులైన దాసరి నారాయణరావు దర్శకత్వంలో నారాయణమూర్తి నటించిన ‘ఒరేయ్ రిక్షా’ బంపర్ హిట్టయింది.
ఆ సమయంలోనే ‘పీపుల్స్ స్టార్’ అని బిరుదునిచ్చారు దాసరి. అప్పటి నుంచీ ఇప్పటి దాకా ఆర్ .నారాయణ మూర్తి ప్రజాసమస్యలపై తన చిత్రాల ద్వారా పోరు సాగిస్తూనే ఉన్నారు..ప్రస్తుతం ఆర్. నారాయణ మూర్తి ఏ సినిమా తెరకెక్కించక పోయినా, మళ్ళీ ఏదో ఒక ప్రజాసమస్యపై ఆయన ఓ చిత్రాన్ని రూపొందిస్తారనే నమ్మకంతో ఉన్నారు జనం. “ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియెల్లో…” అనే పాట వినగానే నటుడు,నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి గుర్తుకు వస్తారు. ఇక ఆయన పేరు తలచుకోగానే ఎర్రజెండా సినిమాలే స్ఫురిస్తాయి.