1969 లో హీరో కృష్ణ, విజయనిర్మల గారు గోదావరి నది లో పడవ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.” అమ్మ కోసం ” చిత్రం షూటింగ్ కోసం రాజమండ్రి చేరుకున్నారు కృష్ణ, విజయనిర్మల జంట, అప్పటికి వీరి వివాహం జరిగి అయిదు రోజులే అయింది. పాపి కొండల దగ్గర షూటింగ్ ప్లాన్ చేసి యూనిట్ అంత అక్కడకు చేరుకున్నారు, యూనిట్ సభ్యులు, నటులకు ప్రక్కన ఉన్న పల్లెలో బస ఏర్పాటు చేసారు. ఈ కొత్త జంటకు మాత్రం రాజమండ్రి నుంచి ఒక బోట్ హౌస్ తెప్పించి అందులో బస ఏర్పాటు చేసారు. వారం రోజులుగా షూటింగ్ నడుస్తుంది, ఉన్నట్లుండి తుఫాను కారణంగా భయంకరమయిన గాలులతో కూడిన వర్షం, షూటింగ్ ఆగిపోయింది.
గోదావరిలో ప్రవాహం పెరిగింది, ఆ నీటి వేగానికి, గాలులకు, కృష్ణ, విజయనిర్మల ఉన్న బోట్ హౌస్ కుదుపులకు లోనయింది, దానికి కట్టి ఉన్న తాడు తెగి,బోట్ మెల్లగా నీటివాలుగా కదలటం మొదలయింది,యూనిట్ సభ్యులు అందరు హాహాకారాలు చేస్తున్నారు కృష్ణ, విజయనిర్మల బోటులో ఉన్నారు, బయటకు రాలేని పరిస్థితి, నూకలు చెల్లిపోయాయి అనుకోని అలాగే ఉండిపోయారు. అప్పుడు స్టంట్ మాస్టర్ రాఘవులు గారు షూటింగ్ కోసం తెచ్చిన గుర్రాలకు తాళ్లు కట్టి, గోదావరి లో దూకి ఈదుకుంటూ వెళ్లి ఆ తాళ్లను బోట్ కు కట్టి గుర్రాలతో బోట్ ను ఒడ్డుకు లాగించారు. అతి కష్టం మీద బోట్ ను ఒడ్డుకు లాగిన తరువాత, కృష్ణ,విజయనిర్మల ఇద్దరు,బతుకు జీవుడా అనుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు..