మొదటిసారి సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నం చేసిన సందర్భంగానే, అంటే 13 ఏళ్ళ వయసులోనే సావిత్రి గారు తన భావిభర్త అయిన జెమినీ గణేశన్ (GG) ని మొదటిసారి చూడడం జరిగింది. ఆయన యువకుడు, అందగాడు. అప్పటికింకా తమిళ హీరో కాలేదు. జెమినీ స్టూడియోలో స్టిల్ ఫోటోగ్రాఫర్ గా ఒక చిన్న ఉద్యోగం చేస్తూండేవాడు, ఆయనకి అలమేలు, పుష్పవల్లి అని ఇద్దరు భార్యలూ, పిల్లలు కూడా.. సావిత్రికి స్టిల్ ఫోటోలు తీసింది ఆయనే. ఆయన ఆమెకి తీసిన ఫోటోల సంగతెలా ఉన్నా ఆయన రూపం సావిత్రి మనస్సనే ఫిలిమ్ మీద శాశ్వతంగా ముద్రించుకుపోయింది. ఎన్ని సంవత్సరాలు పోయినా, ఎక్కడున్నా GG ని జ్ఞాపకం చేసుకునేది. అందుకే 1953 లో కేవలం 18 వ ఏటనే ఎవరికి చెప్పకుండా ఆయన్ని రహస్యంగా పెళ్ళిచేసుకుంది.
అయితే ఈ విషయాన్ని వారు మూడేళ్ళ తరువాత ప్రపంచానికి వెల్లడించారు. నిజానికి 1953 నాటికే ఆమె సౌత్ లో ఒక స్టార్ గా వెలుగొందుతోంది. కనుక ఈ వార్త సహజంగానే దేశంలో గగ్గోలు పుట్టించింది.”GG కి మూడో భార్యగా సావిత్రి” అని ఎగతాళి చేసి పెట్టాయి పత్రికలు. అయితే అప్పట్లో ఏకపత్నీత్వం గట్రా చట్టాలేవీ లేవు కనుక సమస్యేం రాలేదు. ఒకవేళ తలెత్తినా సావిత్రి తాను నమ్మినదానికి నిలబడే మనిషే తప్ప లోకాన్ని లెక్కచేసే తత్త్వం కాదు. కానీ చిత్రమేంటంటే పెళ్ళయ్యాక సావిత్రికి జనంలో క్రేజ్ ఇంకా పెరిగిపోయి తారస్థాయికి చేరుకుంది..ఎంత ఎదిగిన ఒదిగినట్టే ఉండే స్వభావం సావిత్రి గారిది..అహం, ఈర్ష, కోప రాగ ద్వేషాలు ఏమి లేని మనిషిగా ఇండస్ట్రీ లో సావిత్రి గారు మహానటి అయ్యారు.. ‘వి మిస్ యు’ మహానటి సావిత్రమ్మ..