RRR హీరోయిన్ అలియా భట్ నటించిన ‘గంగూబాయి’ చిత్రాన్ని ఎవరి జీవిత కథతో తీశారో..ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు సినిమా పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.గంగూబాయి దత్తపుత్రుడైన బాబు రావుజీ షా, ఇతర కుటుంబ సభ్యులు ఇప్పటికే ‘గంగూబాయి’ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేసు వేశారు. సినిమా విడుదలపై స్టే విధించేందుకు బాంబే హైకోర్ట్ నిరాకరించినప్పటికీ.. కేసు మాత్రం నడుస్తోంది. ఈ నేపథ్యంలో బాబు రావుజీ ఒక జాతీయ మీడియా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఇందులో అతను మాట్లాడుతూ.. ‘‘సినిమా కోసమని నా తల్లిని వేశ్యగా మార్చారు. అసలు మా అమ్మ వేశ్యనా.. సామాజిక కార్యకర్తనా అని ఇప్పుడు అనేకమంది అవమానిస్తున్నారు. ఈ మాటలు మమ్మల్ని బాధిస్తున్నాయి. అమ్మ గురించి అందరూ ఇలా మాట్లాడుతుంటే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం’’ అన్నాడు. మరోవైపు గంగూబాయి మనవరాలు భారతి మాట్లాడుతూ.. గంగూబాయి గురించి పుస్తకం రాసేటపుడు కానీ.. ఆమెపై సినిమా తీసేటపుడు కానీ తమ అనుమతి తీసుకోలేదని..
డబ్బు కోసం వాళ్లు దిగజారి ప్రవర్తిస్తున్నామని.. ‘గంగూబాయి’ సినిమాను తామెవ్వరం అంగీకరించబోమని.. తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించింది. గంగూబాయి సినిమా మొదలైనప్పటి నుంచి ఆమె కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని.. కుటుంబ సభ్యులు ఇప్పటికే అనేక ఇళ్లు మారారని.. వాళ్లంతా అజ్ఞాతంలో ఉండాల్సి వస్తోందని వారి తరఫు లాయర్ చెప్పారు. ఐతే ఈ విమర్శలు, ఆరోపణలు పట్టించుకోకుండా బన్సాలీ అండ్ టీం సినిమా విడుదల పనుల్లో నిమగ్నమైంది. బన్సాలీ సినిమాలకు ఇలాంటి వివాదాలు కొత్తేం కాదు. ‘పద్మావతి’ విషయంలో జరిగిన రచ్చ ఇంతకంటే చాలా ఎక్కువే.