కరోనా వైరస్ కారణంగా విడుదలకు ఎదురు చూస్తున్న చిత్రాల్లో పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. న్యాచురల్ స్టార్ నాని విలన్ గా నటించిన వీ సినిమాతో పాటు రామ్ రెడ్, అనుష్క నిశబ్ధం సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. కానీ ఇప్పుడప్పుడే థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవటంతో ఇన్నాళ్లుగా వేచి చూసిన వీ సినిమాను డిజిటల్ రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు.
నిజానికి చాలా కాలం క్రితమే డిజిటల్ రిలీజ్ పై చర్చ జరిగినా. నాని కోరిక మేరకు నిర్మాత దిల్ రాజు వెయిట్ చేస్తూ వచ్చారు. కానీ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేకపోవటంతో డిజిటల్ రిలీజ్ కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. థియరేటికల్ రైట్స్ తో వచ్చే లాభంతో సమానంగా దాదాపు 33కోట్లకు అమెజాన్ సంస్థ వీ సినిమాను కొనుగోలు చేసింది.సెప్టెంబర్ 5న ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కాబోతుంది.