దేవుడే గెలిచాడు” 1976 లో విజయ నిర్మల గారి డైరెక్షన్ వచ్చిన హారర్ చిత్రం రిలీజ్ సందర్భంలో అరుదైన సంఘటన జరిగింది. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి అన్ని అడ్డంకులే, మలయాళ చిత్రం హక్కులు కొన్న విజయ నిర్మల గారిని అందరు నిరుత్సాహ పరిచారు, ఇటువంటి ఆత్మలు ,పునర్జన్మల సినిమాలు తెలుగులో పెద్దగా పే చెయ్యవు అని అందరు పెదవి విరిచారు. కానీ కృష్ణ గారు మాత్రం ఆమెను ఎంకరేజ్ చేసారు, కృష్ణ గారి డేట్స్ లేవు, అయినా ఏదో అడ్జస్ట్మెంట్ చేసి సినిమా స్టార్ట్ చేసారు.
అనుకోని కారణాల వలన కృష్ణ గారి వేరే చిత్రం షూటింగ్ క్యాన్సిల్ అవటం తో ఆ డేట్స్ ని ఉపయోగించుకొని ఈ చిత్రాన్ని 28 రోజులలో పూర్తి చేసారు విజయ నిర్మల గారు. సినిమా పూర్తి అయి రిలీజ్ కి రెడీ అయిన టైం కి పెద్ద తుఫాను, వర్షాల దెబ్బకు రైలు పట్టాలు కొట్టుకొని పోయి ఫిలిం బాక్స్ లు ఎక్కడకు పంపలేని పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి చుసిన కృష్ణ గారు తన సినిమా విడుదల ఆగటానికి వీలు లేదని ఒక నిర్ణయం తీసుకున్నారు. కృష్ణ గారికి అప్పట్లో పొడవయిన పడవలాంటి ఇంపాలా కార్ ఉండేది.
ఫిలిం బాక్స్ లు అన్ని ఆ కార్ లో పెట్టించారు..విజయ నిర్మల గారి తమ్ముడు, ఆ చిత్ర నిర్మాత అయిన రఘునాథ్ గారు స్టీరింగ్ ముందు కూర్చున్నారు, కృష్ణ గారు అతనితో కల్సి, ఆ తుఫానులో రాత్రి మద్రాస్ నుంచి బయలుదేరి, నెల్లూరు , ఒంగోలు, గుంటూరు, లో ప్రింట్లు అందజేసి తెల్లవారేసరికి విజయవాడ చేరుకున్నారు. అంత వర్షంలో కూడా సినిమా విడుదలకు ఎటువంటి ఆటంకం కలగకుండా కృష్ణ గారు చేసిన సాహసం ఇండస్ట్రీ మొత్తం చెప్పుకున్నారు అప్పట్లో.” దేవుడే గెలిచాడు ” సినిమా రిలీజ్ సందర్భంగా” కృష్ణే గెలిచాడు” అని నిరూపించారు కృష్ణ గారు.