దేవి శ్రీ ప్రసాద్ అంటే తెలుగునాట చాలామంది కి సుపరిచితమయిన పేరు, ఆ పేరు వెనుక ఒక చిన్న కథ ఉంది. అలాగే అయన అతి చిన్న వయసులోనే సంగీత దర్శకత్వం వహించిన చిత్రం పేరు కూడా “దేవి” దాని వెనుక కూడా ఒక కధ ఉంది. దేవి శ్రీ ప్రసాద్ నాన్న గారు, ప్రముఖ రచయిత సత్య మూర్తి గారు, దేవి శ్రీ ప్రసాద్ అమ్మమ్మ గారయిన దేవి మీనాక్షి పేరులోని దేవి ని తీసుకొని తాత గారయిన వరప్రసాద్ గారి పేరులోని ప్రసాద్ ను జోడించి మధ్యలో శ్రీ చేర్చి, ఏర్చి, కూర్చి దేవి శ్రీ ప్రసాద్ అని నామకరణం చేసారు. చిన్న నాటి నుంచి సంగీతం మీద మక్కువ పెంచుకున్న దేవి ఎప్పుడు ఏదో ఒక వాయిద్యం నేర్చుకొంటూ ఉండే వాడు.
ప్రముఖ నిర్మాత ఏం.ఎస్. రాజు గారు సత్య మూర్తి గారిని కలవటానికి తరచు ఇంటికి వస్తుండే వారు. ఆయన ఎప్పుడు వచ్చిన ఏదో ఒక వాయిద్యం వాయిస్తూ కనిపించిన దేవి ని పిలిచి, నేను ఒక సందర్భం చెపుతాను దానికి నువ్వు ట్యూన్ చేయగలవా అని సందర్భం చెప్పిన ఒక్క రోజులోనే ట్యూన్ చేసి రాజు గారికి వినిపించాడు. అలాగే ఇంకొక సందర్భానికి కూడా ఒక్క రోజులోనే ట్యూన్ చేసేసాడు. దేవి లోని స్పార్క్ గుర్తించిన ఏం.ఎస్. రాజు గారు తాను తీయబోతున్న దేవి అనే చిత్రానికి సంగీత దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చారు. ఆలా దేవి శ్రీ ప్రసాద్ ” దేవి” అనే చిత్రం తో తన సినీ ప్రయాణం మొదలు పెట్టారు.