హాస్య నటుడు రాజ బాబు, గొప్ప మనసున్న మారాజు ఎన్నో సందర్భాలలో ఎంతో మంది ఆయన మంచితనం గురించి చెప్పి ఉంటారు మీరు వినే ఉంటారు, లేదా చదివి ఉంటారు, కానీ ఆయన మంచి తనం గురించి ఎంత చెప్పిన ఇంకా ఏదో మిగిలే ఉంటుంది. రాజ బాబు సురా పానములో దేవతలతో పోటీ పడేవారు , అలాగే మంచి తనం లో దేవుళ్ళకు పోటీనిచ్చేవారు అనటం లో అతిశయోక్తి కాదు, అటువంటిదే ఒక సంఘటన. ఖాళీ సమయం లో సురా పానం తో పాటు, చతుర్ముఖ పారాయణం కూడా రాజా బాబు కు అలవాటు, అదేనండి పేకాట. ఒక రోజు మద్రాసు ఆంధ్ర క్లబ్ లో పేకాట ఆడి అర్ధ రాత్రి ఇంటికి చేరుకున్నారు, చాలా గంభీరంగా, మౌనంగా ఏదో ఆలోచిస్తూ కూర్చున్న రాజ బాబు ను చూసి ఆయన తమ్ముడు చిట్టి బాబు ఏంటన్నయ్య అలా ఉన్నావు అని అడిగారట, సైలెంట్ గ ఫుల్ బాటిల్ ఓపెన్ చేసిన రాజ బాబు, రెండు పెగ్గులు వేసి, ఏమి లేదురా, పేకాటలో లక్ష రూపాయలు వచ్చాయి అన్నారట..
అదేంటన్నయ్య లక్ష రూపాయలు వస్తే సంతోషం గ చెప్పకుండా ఆలా దిగులుగా చెపుతావేంటి అన్నారట చిట్టి బాబు, ఆ రోజుల్లో అది చాలా పెద్ద అమౌంట్, పేకాటలో వచ్చిన డబ్బులు మనకు వద్దురా, అంటూ భోరున ఏడ్చేశారట. అది చూసిన చిట్టి బాబు హతాశుడయి అలాగే ఉండి పోయారు, తేరుకొని కళ్ళు తుడుచుకొన్న రాజ బాబు, మళ్ళీ కారులో ఆంధ్ర క్లబ్ కి వెళ్లి, అదే టేబుల్ లో కూర్చొని లక్ష రూపాయలు ఓడిపోయేంతవరకు ఆడి, తిరిగి తెల్ల వారుతుండగా ఇల్లు చేరుకున్నారట. ఎక్కడికి వెళ్లావన్నయ్య అని అడిగిన చిట్టి బాబు తో మళ్ళీ వాళ్ళతోనే ఆడి ఓడిపోయి, వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇచ్చేసి వచ్చానురా, ఇప్పుడు నా మనసు తేలికగా ఉంది, అరేయ్ చిట్టి, ఒక్కటి గుర్తు పెట్టుకో ఎప్పుడు జూదం లో వచ్చిన డబ్బులు మనవి అని అనుకోకు, దాని వెనుక చాలా మంది ఉసురు ఉంటుంది , అటువంటి పాపపు సొమ్ము మనకు వద్దురా, అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్లి పోయారట. మరి ఇటువంటి వాడిని మనసున్న మారాజు అనక ఏంకేమనాలి, మీరే చెప్పండి?