సీనియర్ సినెమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి దొంగతనంగా సినిమాలు చూసి, రాత్రి ఇంటికి రాకుండా బడ్డీ కొట్టు, బల్ల మీద నిద్రపోయే వారు. ఇప్పుడు కాదండి బాబు, స్కూల్ లో చదువే రోజుల్లో, చదువు మీద పెద్ద ఇంటరెస్ట్ లేని గోపాల్ రెడ్డి,సాయంత్రం ట్యూషన్ కి వెళ్లి రాత్రి అక్కడే నిద్రపోయి ఉదయం ఇంటికి వచ్చేట్లు ఏర్పాటు చేసారు వాళ్ళ నాన్న గారు. మన వేణు గోపాల్ రెడ్డి ( గోపాల్ రెడ్డి పూర్తి పేరు అదే), మాత్రం సాయంత్రం ట్యూషన్ కి అని బయలు దేరి ట్యూషన్ కి వేళ్ళకుండా, ఊరిలోని సినిమా హాల్ కి వెళ్లే వారు, అక్కడ ఉన్న బడ్డీ కొట్టు చాటున బుక్స్ దాచి సినిమా చూసే వారు. నాన్న గారు పంచాయితీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావటం తో, టికెట్ లేకుండా పంపించేసేవారు.
సినిమా చూసుకొని రాత్రికి ట్యూషన్ మాస్టర్ ఇంటికి వేళ్ళ లేక, ఇంటికి వెళితే ట్యూషన్ కి వేళ్ళ లేదని తెలిసిపొద్దని, రాత్రికి అందరు వెళ్లిపోయే వరకు అటు,ఇటు తిరిగి బడ్డీ కొట్టు బెంచి మీద పడి నిద్రపోయి, ఉదయాన్నే బుక్స్ తీసుకొని పద్దతిగా ఇంటికి వెళ్లిపోయే వారట. ఆలా డబ్బులు అవసరం లేదు కాబట్టి, వెంకటేశ్వర మహత్యం సినిమా పది, పదిహేను సార్లు చూశారట. ఇటువంటి దొంగ పనులు ఎక్కువ రోజులు దాగవు కదా, ఒక రోజు వాళ్ళ నాన్న గారికి విషయం తెలిసి బాగా దేహ శుద్ధి చేశారట. అప్పట్లో వారి నాన్న గారు అనుకోని ఉండరు,తెలుగు సినిమా గర్వించదగిన కెమరామెన్ , ప్రొడ్యూసర్, డైరెక్టర్ అవుతారని, ఆయనే కాదు గోపాల్ రెడ్డి గారే అనుకోని ఉండరు.