తొలి సినిమాతోనే సూపర్ హిట్టు కొట్టి, ఆ తరవాత… మళ్లీ అలాంటి విజయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన దర్శకులు చాలామందే ఉన్నారు. వాళ్లలో భాస్కర్ ఒకడు. బొమ్మరిల్లుతో ఒక్కసారిగా టాలీవుడ్ ని షేక్ చేశాడు. అదో నయా క్లాసిక్. ఇప్పటికీ ఆ సినిమా టీవీలో వస్తుంటే మంచి రేటింగ్స్వస్తుంటాయి. ఆ తరవాత తను తీసిన `పరుగు` ఓకే అనిపించుకుంది. ఆరెంజ్, ఒంగోలు గిత్త అట్టర్ ఫ్లాప్స్ అయ్యేసరికి.. భాస్కర్ రాత మారిపోయింది. ఒక్కసారిగా డౌన్ ఫాల్ లో పడిపోయాడు. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` కి ముందు భాస్కర్ పై ఎవరికీ నమ్మకాలు లేవు.
ఆ సినిమాకి గీతా ఆర్ట్స్ నెలకు 2 లక్షల జీతంతో.. సర్దుకోపమని చెప్పింది. భాస్కర్ పరిస్థితి అదీ. అయితే..`బ్యాచిలర్` డీసెంట్ వసూళ్లని అందుకున్నాడు. గీతా ఆర్ట్స్‌కి లాభాలు తెచ్చిపెట్టాడు. ఈ హిట్ తో.. భాస్కర్ గీత మారినట్టైంది. అంతేకాదు.. గీతా ఆర్ట్స్‌లో మరో సినిమా చేయడానికి భాస్కర్ రెడీ అయిపోయాడు. ఈ సినిమాకి మాత్రం అదిరిపోయే రెమ్యునరేషన్ ఇస్తున్నార్ట. `బ్యాచిలర్` సమయంలోనే గీతా ఆర్ట్స్‌కి మరో కథ వినిపించాడు భాస్కర్. ఆ కథని ఇప్పుడు పట్టాలెక్కించబోతున్నారు. అయితే హీరో ఎవరు? మిగిలిన వివరాలేంటి? అనేది ఇంకా తెలీదు. త్వరలో ఆ సంగతులు బయటపెడతారు.