తమిళ నటి, బిగ్ బాస్ ఫేం మీరా మిథున్‌ను పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. ఈమెను గత ఏడాదే పోలీసులు దళితులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టు చేశారు. అయితే, బెయిల్ పై విడుదలైన మీరా మిథున్ విచారణలకు హాజరుకాకపోవటంతో.. తాజాగా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలో పోలీసులు మీరా మిథున్‌ను మరోసారి అరెస్ట్ చేశారు. చెన్నై సైబర్ క్రైం పోలీసులు శనివారం సాయంత్రం ఆమెను కేరళలో అదుపులోకి తీసుకున్నారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన దళిత నటులు, డైరెక్టర్లపై ఆమె గత ఏడాది అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది.
అక్రమ కార్యకలాపాలు, నేరాల్లో పాల్గొంటారు కాబట్టే దళితులు సమస్యల్లో ఇరుక్కుంటున్నారని, కారణం లేకుండా ఎవరూ వారిని ఏమీ అనరని ఆమె వ్యాఖ్యానించింది. ఇలాంటి దళితులు, డైరెక్టర్లను ఇండస్ట్రీ నుంచి తరిమేయాలని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలోనే గత ఏడాది సెప్టెంబర్‌లో ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు పెట్టారు. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కొన్ని విచారణలకు హాజరైన ఆమె.. తర్వాతి విచారణలకు హాజరు కాలేదు. దీంతో ఎగ్మూరులోని కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. ఆ ఆదేశాల నేపథ్యంలోనే పోలీసులు ఆమెను మరోసారి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.