ఆరెంజ్ సినిమా కమర్షియల్‌గా ఆడకపోయినా.. ఓ వర్గం ప్రేక్షకులకు నచ్చింది. ఇదొక మంచి ప్రయత్నం అనడంలో సందేహం లేదు. దర్శకుడు భాస్కర్ సైతం ఆరెంజ్ తనకు ఎప్పటికీ స్పెషల్ ఫిలిమే అంటున్నాడు. ఆ సినిమా చాలామందికి నచ్చిందని.. ఇప్పటికీ ఎంతోమంది ఆరెంజ్ లాంటి సినిమా తీయమని అంటుంటారని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు భాస్కర్. తన కెరీర్లోనే అత్యంత కష్టపడి తీసిన సినిమా ఆరెంజ్ అని కూడా అతను వెల్లడించాడు. ఆ సినిమా కోసం రేయింబవళ్లు కష్టపడ్డానని..
కొన్నిసార్లు రాత్రంగా స్క్రిప్టు చర్చలు జరుపుతూ తెల్లవారిపోయేదని.. ఇంతగా మరే సినిమాకూ తాను శ్రమించలేదని భాస్కర్ తెలిపాడు. ఒక మంచి ఐడియా అనుకుని దాని మీద నమ్మకంతో వెళ్లిపోయామని.. ఐతే స్క్రీన్ ప్లే విషయంలో కొంచెం దారి తప్పడంతో ఆ సినిమా ఆడలేదని భాస్కర్ అన్నాడు. ఈ సినిమా పరాజయం పాలైనప్పటికీ.. తాను తన మార్గంలోనే వెళ్లాలని అల్లు అరవింద్ సూచించాడని.. కానీ తాను తనకు నప్పని ఒంగోలు గిత్త సినిమా చేశానని.. ఆరెంజ్ కోసం అప్పటికే విపరీతంగా కష్టపడి ఉండటంతో ఈ సినిమాకు అంత ఎఫర్ట్ పెట్టలేకపోయానని భాస్కర్ చెప్పాడు.