ఒక కథతో రెండు సినిమాలు అనే వివాదాలు గతంలో చాలా సార్లు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు మరోసారి అలాంటి సంఘటన చోటుచేసుకుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో దోపీడీ దొంగగా అందరినీ హడలెత్తించిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా బెల్లంకొండ శ్రీనివాస్ ఓ సినిమా చేయాలనుకున్నారు. దానికి ‘స్టువర్టుపురం దొంగ’ అనే టైటిల్ కూడా పెట్టుకున్నారు. కేఎస్ అనే దర్శకుడితో బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి సురేష్ ఈ సినిమాను నిర్మించాలనుకున్నారు.
దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చింది..అయితే ఈ సినిమాను ప్రకటించిన కొన్ని రోజుల తరువాత ఇదే కథతో ‘టైగర్ నాగేశ్వరావు’ అనే టైటిల్ పెట్టి రవితేజ ఓ సినిమాను ప్రకటించారు. వంశీ ఆకెళ్ల ఈ సినిమాను డైరెక్ట్ చేయాలనుకున్నారు. అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించనున్నట్లు ప్రకటించింది. దీంతో ఒకే కథతో ఒకే సమయంలో రెండు సినిమాలు రావడమనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఒకే స్టోరీతో రెండు సినిమాలు రావడంలో అర్ధం లేదు కాబట్టి వీటిలో ఏదో ఒక సినిమా డ్రాప్ అవుతుందని అనుకున్నారు. దానికి తగ్గట్లే ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ రాజీ పడినట్లు తెలుస్తోంది. ‘స్టువర్టుపురం దొంగ’ సినిమాను ఆపేస్తున్నట్లు సమాచారం. రవితేజ సినిమా భారీ స్కేల్ లో నిర్మిస్తుండడం.. తన సినిమా కంటే ముందే రవితేజ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉండడంతో బెల్లంకొండ తన సినిమాను ఆపేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం బెల్లంకొండ బాలీవుడ్ లో ‘ఛత్రపతి’ రీమేక్ లో నటిస్తున్నారు.