తొలిసారి తన కెరీర్‌లో ఓ తమిళ హీరోతో సినిమా చేస్తున్నాడు దిల్ రాజు. విజయ్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రాన్ని దిల్ రాజు సెట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా రూ.200 కోట్లు. అందులో వంద కోట్లు విజయ్ పారితోషికానికే సరిపోతుంది. విజయ్‌కి ఉన్న మార్కెట్ దృష్టిలో పెట్టుకుంటే ఇదేమంత రిస్కీ ప్రాజెక్ట్ కాదు. కాకపోతే… ఇటీవల విడుదలైన `బీస్ట్`.. బ్లాస్ట్ అవ్వకుండా తుస్సుమంది. ఈ సినిమాకి ఏపీలో కనీసం ఓపెనింగ్స్ రాలేదు. తమిళంలో కూడా అదే దారి. దాంతో దిల్ రాజు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయిప్పుడు..విజయ్ నటిస్తున్న తొలి తెలుగు సినిమా – అంటూ దిల్ రాజు గొప్పగా చెప్పుకుంటే, విజయ్ ముందే గాలి తీసేశాడు.
`ఇది తెలుగు సినిమా కాదు. తమిళంలోనే తీస్తున్నాం. తెలుగులో డబ్ చేస్తున్నాం` అని విజయ్ క్లారిటీ ఇచ్చేశాడు. దాంతో.. ఇది డబ్బింగ్ సినిమాగానే తెలుగులో రాబోతోంది. బీస్ట్ ఫ్లాప్ తో.. విజయ్ పై పెట్టుబడి పెట్టడానికి బయ్యర్లు కాస్త ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. విజయ్ గత సినిమాల మార్కెట్ కీ, ఇప్పుడు దిల్ రాజు సినిమాకీ చాలా తేడా ఉంటుంది. దిల్ రాజు తెలుగు నాట కింగ్. కానీ తమిళ మార్కెట్, అక్కడి స్ట్రాటజీలు పూర్తిగా కొత్త. ఇలాంటి తరుణంలో.. విజయ్ సినిమాని తమిళంలో ఎలా అమ్ముకోవాలి? ఎలా మార్కెట్ చేసుకోవాలో తెలీక… దిల్ రాజు తర్జన భర్జనలు పడుతున్నట్టు టాక్.