బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ మరోసారి న్యాయపరమైన చిక్కుల్లో పడింది. తాజాగా ఆమెపై చీటింగ్ కేసు నమోదైంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు డబ్బులు తీసుకుని.. అమీషా పటేల్ దారుణంగా మోసం చేసిందంటూ సామాజిక కార్యకర్త సునీల్ జైన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో ఓ కార్యక్రమం కోసం నిర్వాహకులు అమీషా పటేల్‌ను సంప్రదించారు. గంటసేపు ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆమె రూ.4 లక్షలు వసూలు చేసింది. తీరా ప్రాగ్రామ్‌కు వచ్చిన తర్వాత కేవలం మూడు నిమిషాలే స్టేజీపై కనిపించి మాయమైంది.
దీంతో అమీషా మోసం చేసిందంటూ ప్రోగ్రాం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ట్విటర్ వేదికగా స్పందించిన అమీషా.. ‘ఏప్రిల్ 23వ తారీఖు మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా సిటీలో నవచండీ మహోత్సవాలకు హాజరయ్యాను. స్టార్ ఫ్లాష్ ఎంటర్‌టైన్‌మెంట్, అరవింద్ పాండే ఈ కార్యక్రమానికి సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు. నాకు ప్రాణ భయం పట్టుకుంది. స్థానిక పోలీసులే నా రక్షణ బాధ్యతలు చూసుకున్నారు. వారికి కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.