సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నెక్స్ట్ మూవీ గురించి చాలా కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో తన రెండు సినిమాలు ఉండబోతున్నాయని అనుష్క సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. కానీ ఈ ఏడాది చివరికి వచ్చినా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో వారికి నిరాశే ఎదురయ్యింది. అయితే తాజా సమాచారం ప్రకారం అనుష్క నెక్స్ట్ మూవీ క్రేజీ హారర్ సీక్వెల్. 2005లో విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను థ్రిల్ చేసిన “చంద్రముఖి” చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న “చంద్రముఖి-2″లో అనుష్క హీరోయిన్ గా నటించబోతోంది. 2005లో విడుదలైన “చంద్రముఖి”లో రజనీకాంత్, ప్రభు, జ్యోతిక మరియు నయనతార కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. రజనీకాంత్ కెరీర్లో అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ మోహన్ లాల్, శోభన జంటగా నటించిన మలయాల సూపర్ హిట్ మూవీ “మణిచిత్రతజు”కి రీమేక్. ఈ మూవీ సీక్వెల్ లో రజనీకాంత్ స్థానంలో రాఘవ లారెన్స్ నటించనున్నారు. దర్శకుడు పి వాసు మొదట సీక్వెల్ కోసం రజనీకాంత్‌ని సంప్రదించినట్టు ఊహాగానాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం డేట్స్ కాళీ లేకపోవడంతో రజినీ ప్రాజెక్ట్‌ను చేయలేకపోయాడని సమాచారం. ప్రస్తుతం “చంద్రముఖి-2″ను తెరకెక్కించడానికి దర్శకుడు పి వాసు సిద్ధంగా ఉన్నారు. రాఘవ లారెన్స్, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. ఈ మూవీని సన్ పిక్చర్స్ నిర్మించబోతోంది. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ లో ప్రారంభం కానుంది.