మనసుకు కష్టం కలిగినప్పుడూ బాధపడుతూ కాలాన్ని గడపవొద్దని చెబుతోంది మలయాళీముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. జీవితంలో మళ్లీ వెలుగుల్ని చూసే రోజులు వస్తాయనే నమ్మకంతో ఉండటం ముఖ్యమని అంటోంది. మలయాళ చిత్రసీమకు దూరంగా ఉంటూ తెలుగు, తమిళ భాషలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తోంది అనుపమ పరమేశ్వరన్. మాతృభాషలో సినిమాలు చేయకపోవడానికి గల కారణాల్ని ఆమె వెల్లడిస్తూ ‘తొలి సినిమా ‘ప్రేమమ్’ విడుదల తర్వాత కొందరు నాపై పనిగట్టుకొని దుష్ప్రచారం చేశారు. అహంకారిననే ముద్రవేశారు.
నా మాటల్ని వక్రీకరిస్తూ నా గురించి అసత్యాల్ని ప్రచారం చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా వారు చేసిన విమర్శలు నన్ను చాలా బాధించాయి. మలయాళంలో మళ్లీ సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నా. ‘ప్రేమమ్’ తర్వాత మలయాళంలో పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినా తిరస్కరించి తెలుగులో నటించా. చిన్న వయసులోనే మోసమేమిటో చూశా. ఏదిఏమైనా బాధపడుతూ కూర్చొకుండా జీవితాన్ని కొత్తగా ప్రారంభించడం ముఖ్యమని తెలుసుకున్నా’ అని తెలిపింది.