తెలుగులో ఫ్రాంచైజీలకు అంత సీన్ లేదు. కాకపోతే.. అలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. మనీ హిట్టయ్యాక.. మనీ 2 వచ్చింది. అది కాస్తో కూస్తో మంచి ఫలితాన్నే అందుకుంది. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ ఫ్రాంచైజీలే అయినా.. బాలీవుడ్ రీమేక్ కావడంతో తెలుగు లెక్కలోకి రావు. సింగం సిరీస్ కూడా అంతే. తెలుగులో ఇప్పుడు మళ్లీ ఫ్రాంచైజీల హడావుడి మొదలైంది. ఎఫ్ 2కి కొనసాగింపుగా ఎఫ్ 3 వస్తోంది. హిట్ తరవాత.. హిట్ 2 రూపొందుతోంది. ఇప్పుడు ఎఫ్ 4 కూడా రాబోతోందని సమాచారం.
ఎఫ్ 2 ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రమోషన్లు కూడా భారీగా చేస్తున్నారు. ఎఫ్ 3 క్లైమాక్స్‌లో ఎఫ్ 4కి లీడ్ ఇచ్చేశారని, టైటిల్ కార్డు కూడా చూపించబోతున్నారని సమాచారం. ఎఫ్ 4 అనే కాదు.. ఈ ఫ్రాంచైజీ ఎఫ్ 5, 6, 7… ఇలా కొనసాగుతూనే ఉంటుందట. ఎంత వరకూ అంటే, ఈ ఫ్రాంచైజీ హిట్టు అయ్యేంత వరకూ.. రెండేళ్లకు ఓసారి.. ఎఫ్ సిరీస్ తో సినిమా చేయాలని, అది సంక్రాంతికే విడుదల చేసేలా ప్లాన్ చేయాలని అనిల్ రావిపూడి భావిస్తున్నాడట. ఎఫ్ 3 హిట్టయితే.. ఇక ఈ సిరీస్ నిరాటంకంగా కొనసాగడం ఖాయం.