2 సంవత్సరాల విరామం తరువాత సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ తిరిగి ప్రారంభం అయ్యాయి. కోవిడ్-19 మహమ్మారి కారణంగా దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే “సైమా” అవార్డుల ప్రధానం 2020 సంవత్సరంలో జరగలేదు. తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ పరిశ్రమలలో మల్టిపుల్ క్రాఫ్ట్స్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన వారికి “సైమా” అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు కార్యక్రమం సెప్టెంబర్ 18న ప్రారంభం కాగా పలువురు సినీ స్టార్స్ వేడుకలో మెరిశారు. ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలకు అవార్డుల వర్షం కురిసింది.
“మహర్షి” సినిమా సైమా 2021 అవార్డ్స్ ఫంక్షన్ లో ఉత్తమ నటుడు (మహేష్ బాబు), ఉత్తమ దర్శకుడు (వంశీ పైడిపల్లి), ఉత్తమ సంగీత స్వరకర్త (దేవి శ్రీ ప్రసాద్), ఉత్తమ సహాయ నటుడు (అల్లరి నరేష్), ఉత్తమ సాహిత్యం (ఇదే కథ కోసం శ్రీమణి) సహా మొత్తం 5 అవార్డులు గెలుచుకుంది. తాజాగా అల్లు అర్జున్ “అల వైకుంఠపురంలో” చిత్రానికి ఏకంగా 10 అవార్డులు రావడం విశేషం. సినిమా 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైంది మొదలు ఈ సినిమా వరుసగా రికార్డులు నెలకొల్పుతోంది. ఇప్పటికే ఈ సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు “సైమా” వేడుకలో ఏకంగా 10 అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం.