సెలెబ్రిటీలు ఏం మాట్లాడినా ఆలోచించి, ఆచితూచి వ్యవహరిండం మేలు. ముఖ్యంగా.. వివాదాస్పద అంశాలకు సంబంధించిన విషయాల్లో ఏదైనా అభిప్రాయాన్ని వ్యక్తపరచాలనుకుంటే, అది అవతలివారి మనోభావాల్ని దెబ్బతినకుండా ఉండేలా చూసుకోవాలి. లేకుంటే అనవసరమైన సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. తాజాగా బాలీవుడ్ నటి స్వర భాస్కర్ అలాంటి పరిస్థితే ఎదుర్కొంటోంది. ఈమెకు ఏకంగా చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది.
ఇటీవల కాలంలో బెదిరింపు కాల్స్‌తో పాటు బెదిరింపు లేఖలు సెలబ్రిటీలకు ఎక్కువగా వస్తున్నాయి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు ఇటీవలే బెదిరింపు లేఖ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా నటి స్వర భాస్కర్‌కు కూడా బెదిరింపు లేఖ వచ్చింది. స్వర భాస్కర్‌ను చంపేస్తామని అజ్ఞాత వ్యక్తి నుంచి ఆమె నివాసానికి స్పీడ్ పోస్ట్ ద్వారా లేఖ అందింది. ఈ లేఖను చూసిన వెంటనే నటి ముంబైలోని వెర్సోవా పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.
వీర సావర్కర్‌ను అవమానిస్తే దేశ యువత సహించబోదని సదరు లేఖలో దుండగులు స్వర భాస్కర్‌ను హెచ్చరించారు. అసలు ఈ వివాదానికి కారణమేంటంటే… 2017లో వీర్ సావర్కర్‌పై స్వరభాస్కర్ అనుచిత వ్యాఖ్యలు చేసింది. తనను జైలు నుంచి విడిపించాలని వీర్ సావర్కర్ బ్రిటీష్ ప్రభుత్వాన్ని వేడుకున్నాడని, అది వీరత్వం ఎలా అవుతుందంటూ ఆమె ట్వీట్ చేసింది. అప్పట్లో ఈ ట్వీట్ పెద్ద దుమారమే రేపింది..