జస్టిస్ హేమ కమిటీ నివేదిక మలయాళ చిత్ర సీమలో తీవ్ర ప్రకంపనలు రేపుతున్న సంగతి విదితమే. కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత పలువురు నటీనటులు బయటకు వచ్చి గతంలో వారు ఎదుర్కొన్న చేదు అనుభవాలను మీడియా ముందు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు నటులపై కేసులు సైతం నమోదయ్యాయి. లైంగిక వేధింపులపై ఇండస్ట్రీకి చెందిన పలువురు సీనియర్ లు సైతం స్పందించారు. ఇదే క్రమంలో ప్రముఖ నటి నివేదా థామస్ సైతం తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
మలయాళ చిత్ర సీమకు ఇదో చేదు అనుభవమని నివేదా థామస్ అన్నారు. ప్రస్తుతం జరిగే పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు బాధాకరమని అన్నారు. మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (అమ్మా) లో సభ్యురాలిగా ఉన్నానని చెప్పిన నివేదా..జస్టిస్ హేమ కమిటీ ఏర్పాటునకు కారణమైన డబ్ల్యూసీసీని అభినందించారు. పని ప్రదేశాలలో సురక్షితమైన వాతావరణం కల్పించడం కీలకమని అన్నారు. ఇంట్లో కంటే ఎక్కువగా వర్క్ ప్లెస్ లో ఉంటున్నారని, ఈ క్రమంలో సురక్షితమైన వాతావరణం చాలా ముఖ్యమని నివేదా పేర్కొన్నారు..!!