హిమజ..అటు వెండితెర, ఇటు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక బిగ్ బాస్ షో తో మరింత మందికి చేరువైన ఈ బ్యూటీ సోషల్ మీడియా లోనూ ఎంతో చురుగ్గా ఉంటుంది. అయితే ఇటీవల ఈ సొగసరికి సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతోంది. అదేంటంటే..హిమజ త్వరలో తన భర్తకు విడాకులు ఇవ్వబోతుందన్న వార్తలు బాగా హల్ చల్ చేస్తున్నాయి. నిజానికి అసలు హిమజకు వివాహమైందా లేదా అన్న విషయంపై ఇంతవరకు ఎవరికీ స్పష్టత లేదు.
ఎందుకంటే ఆమె తన వివాహం, భర్త గురించి ఎప్పుడు కూడా బయట చెప్పలేదు. అయితే గూగుల్ లో మాత్రం ఆమెకు ఇది వరకే పెళ్లైందని, అతనితో విడిపోయిందని, ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకుందని, ఇప్పుడు మరోసారి విడాకులు తీసుకుంటుందన్న వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో తనపై జరుగుతున్న ప్రచారంపై హిమజ స్పందించింది. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను విడుదల చేసింది. అందులో తనపై వస్తోన్న వదంతులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘ నేనేదో నా షూటింగ్‌లో బిజీగా ఉంటుంటే కొందరు నా స్నేహితులు కొన్ని వీడియో లింక్‌లు పంపారు. అందులో ‘హిమజ భర్తతో విడాకులు తీసుకుంటుంది’ అనే వార్తలున్నాయి. ఏంటో ఇటీవల మనుషులు లేకుండా యూట్యూబ్, సోషల్ మీడియాల్లో పెళ్లిళ్లు చేసి, విడాకులు కూడా ఇచ్చేస్తున్నారు. ఇలాంటి అసత్య వార్తల గురించి నేను పట్టించుకోను. కానీ ఇంట్లోని అమ్మానాన్నలు మనలా ఉండరుగా. కాస్త సున్నితంగా ఉంటారు. ఇలాంటి వదంతులు, వార్తల వల్ల వారి మనసు బాధపడుతుంది. కంగారు పడతారు. దయచేసి ఇలాంటి వార్తలు షేర్ చేయడం మానుకోండి. ఒకవేళ నాకు పెళ్లి చేసినా, విడాకులు ఇప్పించినా ఆ కార్యక్రమాలకు కొంచెం నన్ను కూడా పిలవండి’ ..అంటూ తనదైన స్టైల్ లో రుమోర్స్ కు చెక్ పెట్టింది ఈ బిగ్ బాస్ తెలుగు బ్యూటీ .